Top
Sneha TV

చంద్రబాబు వస్తే మర్యాద ఉండదు: కేసీఆర్

X

ఖమ్మం: కూటమి పేరుతో విపక్ష నేతలు వస్తున్నారని, వారి మాయమాటలను ప్రజలు నమ్మొద్దని టీఆర్ఎస్ అధినేత, ఆపధ్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గులాబీ దళపతి కేసీఆర్ రెండో దఫా ఎన్నికల ప్రచారాన్ని పాలేరు నుంచి ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలేరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. విపక్ష పార్టీలపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఖమ్మం జిల్లాను ఎండబెట్టాయని ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో రైతులకు ఎందుకు కరెంట్ ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. నాలుగేళ్లు అధికారంలో లేకుంటే కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు పాలేరును ఎందుకు పట్టించుకోలేదని కేసీఆర్ ప్రశ్నించారు. తుమ్మల నాగేశ్వరరావు కృషి వల్ల పాలేరు అభివృద్ధిపథంలో నడుస్తుందన్నారు. ఆయనవల్లే భక్తరామదాసు ప్రాజెక్టు పూర్తయిందన్నారు. కుల, మతాలు అన్నం పెట్టవు అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పాలనను, గత ప్రభుత్వాల పాలనను బేరీజు వేసుకొని ఓటువేయాలని పిలుపునిచ్చారు.

గోదావరి పక్కనే ఉన్నా...

గోదావరి నది పక్కనే ఉన్నా ఖమ్మం జిల్లాలో కరువు తాండవిస్తోందని, కాంగ్రెస్, టీడీపీ నేతల మేధావితనం ఏమైందని కేసీఆర్ ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాకు ఎందుకు సాగునీరు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. తెలంగాణలో అన్నింటికీ ఇందిరా, రాజీవ్ పేర్లేనా? అని విమర్శించారు. ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులు ఏపీకి పోయిన ఏడు మండలాల్లో కలిసిపోయాయని అన్నారు. ఆంధ్రాకు నీళ్లు తీసుకెళ్లేందుకే దుమ్ముగూడెం, సాగర్ టెయిల్‌పాండ్‌లు చేపట్టారని కేసీఆర్ ఆరోపించారు. కంటితుడుపు చర్యగా ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులు తెచ్చారని అన్నారు. ఇప్పుడు అవికూడా పోయాయని చెప్పారు. ఏడు మండలాలను, సీలేరు ప్రాజెక్టును తెలంగాణ నుంచి లాక్కున్నారని దుయ్యబట్టారు.

చంద్రబాబుకు మర్యాద ఉండదు..

ఇదే సమయంలో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసీఆర్ నిప్పుల వర్షం కురిపించారు. సీతారామ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రయత్నించిన చంద్రబాబు.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడిగేందుకు వస్తున్నారని విమర్శించారు. సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందని, అలాంటి ప్రాజెక్టును వద్దంటూ కేంద్రానికి చంద్రబాబు లేఖలు రాశారని కేసీఆర్ తెలిపారు. ఎన్నికల ప్రచారానికి వచ్చే చంద్రబాబును ఈ లేఖ విషయంపై ఖమ్మం ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. ఏ ముఖం పెట్టుకుని ఖమ్మం జిల్లాలో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకునేవారికి ఓట్లు ఎలా వేస్తాం అని అన్నారు. సీతారామ ప్రాజెక్టును వ్యతిరేకించే వారిని చిత్తుగా ఓడించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. సీతారామ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోకుండా ఎన్నికల ప్రచారానికి వస్తే చంద్రబాబుకు మర్యాద ఉండదని హెచ్చరించారు.

ఖమ్మం జిల్లాలో 10 స్థానాలు కైవసం..

ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంటుందని గులాబీ దళపతి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న విపక్షాలకు ప్రజలు గట్టి గుణపాఠం చెప్పాలన్నారు. 100 శాతం మ్యానిఫెస్టోను అమలు చేసిన ఘనత టీఆర్‌ఎస్‌దే అని చెప్పారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక.. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్ర సంపద పెంచి.. పేదలకు పంచుతామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు.

సంక్షేమ పథకాలపై కేసీఆర్...

ఒక డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు.. కాంగ్రెస్, టీడీపీ కట్టిన ఏడు ఇళ్లతో సమానం అని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం 2లక్షల 70వేల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. 6నెలలు ఆలస్యమైనా పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కంటి వెలుగు కార్యక్రమం అమలు చేస్తున్నామని అన్నారు. సమైక్య రాష్ట్రంలో కంటి వెలుగు ఎందుకు తీసుకురాలేకపోయారు? అని ప్రశ్నించారు. తెలంగాణ అంగన్‌వాడి, ఆశా వర్కర్లు, హోంగార్డులు దేశంలోనే అత్యధికంగా జీతాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఎక్కడా లేవన్నారు. నిరుద్యోగులకు రూ.3016 భృతి ఇస్తామని ప్రకటించారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడిస్తున్న పెన్షన్లను రెండింతలు చేస్తామని హామీ ఇచ్చారు.

ఏడాదిన్నరలో రైతుల సమస్యను పరిష్కరిస్తాం.. ఏడాదిన్నరలోగా పోడు రైతుల సమస్యను పరిష్కరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. రైతుబంధు కింద ఏడాదికి ఎకరాకు రూ.10 వేలు ఇస్తామన్నారు. రైతుబంధును ఐక్యరాజ్యసమితి ప్రశంసించిందని, దీనిని కాంగ్రెస్‌ గుర్తించడం లేదని విమర్శించారు. రైతు బీమా పథకంతో పేద రైతులకు ప్రయోజనకరంగా ఉందన్నారు. కాంగ్రెస్‌, టీడీపీ నేతలకు బుర్ర లేదు కాబట్టే 60 ఏళ్ల పాలనలో రైతులను ఆదుకోలేదని విమర్శించారు. దేశంలోనే ధనిక రైతులు ఉన్న రాష్ట్రంగా తెలంగాణను అభివృద్ధి చేస్తామన్నారు. రెండేళ్లలో సీతారామ ప్రాజెక్టును పూర్తిచేస్తామన్నారు.

Next Story
Share it