Top
Sneha TV

ఖమ్మంలో క్లీన్‌స్వీప్‌ చేస్తాం: కేసీఆర్‌

X

ఖమ్మం: సీతారామ ప్రాజెక్టును అడ్డుకొనేందుకు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసిన తెదేపా ఏ మొహం పెట్టుకొని ఖమ్మంలో అభ్యర్థుల్ని బరిలో దించిందని తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. ఒకవేళ సీఎం చంద్రబాబు ఇక్కడకు ప్రచారానికి వస్తే ఆయనను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా ఎంతో ఉద్యమ చైతన్యం కల్గిన ప్రాంతమన్నారు. సోమవారం ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. సమైక్య పాలనలో రాష్ట్రాన్ని తెదేపా, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఖమ్మం జిల్లాకు నీరివ్వకుండా ఎండబెట్టాయని మండిపడ్డారు. ఈ జిల్లాకు జరిగిన అన్యాయాల పరంపర మళ్లీ ఈ రోజు జరగబోతోందని, అంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఖమ్మం జిల్లాకు చాలా పెద్ద ప్రమాదం రాబోతోందన్నారు. తెదేపా మూడు స్థానాల్లో అభ్యర్థుల్ని బరిలో దించిందన్న ఆయన.. మన ప్రాజెక్టులను అడ్డుకున్న వ్యక్తులను గెలిపించి మన వేలితో మన కంటినే పొడుచుకుందామా? అని అన్నారు. సీతారామ ప్రాజెక్టును అడ్డుకొనేందుకు చంద్రబాబు ప్రయత్నించడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఆ లేఖను వాపస్‌ తీసుకుంటారా లేదా? ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు? చంద్రబాబు జిల్లాకు వస్తే తొలుత దానిపై సమాధానం చెప్పాకే రావాలన్నారు.

ఆయన డైనమిజం వల్లే పాలేరు పచ్చబడింది!

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురించి చెబితే జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యం వేసినట్టు ఉంటుందన్నారు. ఆయన తనకు ఆప్త మిత్రుడని, ఆయన గొప్పతనమేంటో ప్రజలకు తెలుసునన్నారు. ఆయన చేవ కల్గిన నేత అన్నారు. ఆయన లేకపోతే పది నెలల్లో ఒక ప్రాజెక్టు పూర్తికావడం కష్టమన్నారు. అదీ ఆయన డైనమిజానికి నిదర్శనమని ప్రశంసించారు. కాంగ్రెస్‌, తెదేపా హయాంలో నీటి ప్రాజెక్టులను ఎందుకు కట్టలేదని నిలదీశారు. ఎందుకు పాలేరును ఎండబెట్టారు? అని ప్రశ్నించారు.

ఎన్నికల్లో గెలుపు మాదే!

''ఎన్నికలు వస్తాయి, పోతాయి. గతంలో ఖమ్మం నుంచి ఒక సీటు గెలిచాం. అయినా అధికారంలోకి వచ్చాం. కాబట్టి, ఖమ్మం యావత్తు పార్టీలకు అతీతంగా ఆలోచించాలన్నారు. 'పొలాలకు నీళ్లు రానీయం.. మాకు ఓటేయండి' అంటే వేయడానికి అమాయకులమా? తెరాస అధికారంలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరు. ప్రాజెక్టులను అడ్డుకునేవాళ్లను గెలిపిస్తామా? కంటితుడుపుగానే గతంలో తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించారు. ఖమ్మంలో పోడుభూముల సమస్య శాశ్వతంగా పరిష్కరించేందుకు కేంద్రంతో చర్చిస్తాను' అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

ఖమ్మంలో క్లీన్‌ స్వీప్‌

''ఖమ్మం జిల్లా పోరాటాల గడ్డ. ఎంతోమంది తలపండిన నేతలు పుట్టిన భూమి. ఇక్కడ ఉద్యమ చైతన్యం బాగా ఉంది. రాజకీయానికి వచ్చేసరికి మాకు అనేక కారణాల వల్ల ఇక్కడ సరైన ఫలితాలు వచ్చేవికావు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఖమ్మంలో ఈసారి నాకున్న అంచనా ప్రకారం 10కి 10 సీట్లు తెరాస గెలవబోతోంది'' అని కేసీఆర్‌ ధీమా వ్యక్తంచేశారు.

''కులాల కుల్లు, దొంగ డబ్బు ప్రభావం, గజకర్ణ, గోకర్ణ విద్యలు ఎన్ని ఉన్నా అవేవీ ఖమ్మంలో ఉన్న ప్రజల చైతన్యం ముందు అవి నిలబడవు. ఎన్నికలు వచ్చినప్పుడు కొన్నిశక్తులు, వ్యక్తులు తమ స్వార్థం కోసం అనేక ప్రచారాలు చేస్తుంటాయి. ఆ మాటల ప్రవాహంలో కొట్టుకొని పోవద్దు. ఉద్యమ సమయంలో మేం ఏం చెప్పామో తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో వందకు వంద శాతం అదే జరుగుతోంది. దేశంలో అవాకులు చెవాకులు మాట్లాడటం కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నూరుశాతం అమలుచేసిన పార్టీ మాదే. దీనిపై ఎక్కడైనా మాట్లాడేందుకు సిద్ధం'' అని అన్నారు.

ఆలస్యమైతే కొంపలేమీ అంటుకోవు

''రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం, దళితులకు మూడెకరాల భూమిపై నన్ను ఎంతోమంది ప్రశ్నిస్తున్నారు. అయితే, రాష్ట్రంలో 2.70 లక్షల రెండు పడక గదుల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. మేం కడుతున్న ఈ ఇళ్లు గతంలో పాలకులు కట్టించిన 16 లక్షల ఇళ్లకు సమానం. వారి ఇళ్లు ఎలా ఉన్నాయో, పూర్తి సబ్సిడీపై మేం ఇస్తున్న ఇళ్లు ఎలా ఉన్నాయో ప్రజలకు తెలుసు. ఆలస్యమైనా నాణ్యతతో కట్టాలని నిర్ణయించాం. అలాంటి నాణ్యతలతో కడుతున్న ఇళ్లు ఆర్నెళ్లు ఆలస్యమైనా కొంపలేమీ అంటుకోవు. రెండు తరాలకు సరిపోయే విధంగా ఇళ్లు ఉండాలనేదే తమ ఫిలాసఫీ'' అని కేసీఆర్‌ అన్నారు.

''ఐదేళ్లు అధికారంలో లేకపోయేసరికి హిమాలయాలకు వెళ్లి పవిత్రులైనట్టు ఆరు చందమామలు, ఏడుగురు సూర్యులు పెడతామంటూ విపక్ష నేతలు అంటున్నారు. ఎర్రవల్లిలో కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసినప్పుడు వచ్చిన స్పందనతో వచ్చిన అనుభవం నుంచే కంటి వెలుగు పథకానికి శ్రీకారం చుట్టాం. ఇలాంటి కార్యక్రమం ఏ రాష్ట్రంలోనూ అమలు కాలేదు. మందులు, అద్దాలు ఉచితంగా ఇచ్చాం. కొందరికి శస్త్రచికిత్సలు కూడా చేయించాం. గతంలో ఏనాడైనా ఇలాంటివి ఊహించామా?. రాష్ట్రంలో రూ.43 వేల కోట్లతో సుమారు 411 పథకాలు అమలు చేస్తున్నాం. మానవీయ కోణంలో నేనే స్వయంగా వారాలు, నెలల పాటు చర్చలు జరిపి అమలు చేశాం'' అని వెల్లడించారు.

ఆ మేధావులు కరెంటు ఎందుకివ్వలేకపోయారో!

కాంగ్రెస్‌లో పెద్ద పెద్ద మేధావులు ఉన్నారని, తెదేపా అయితే ఇంకా చెప్పనక్కర్లేదని సీఎం ఎద్దేవా చేశారు. అలాంటోళ్లు పంటలకు విద్యుత్‌ సరిగా ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. దీనికి ఎవరు బాధ్యులు? అని ప్రశ్నించారు. తానూ రైతునేనని, తన ట్రాన్స్‌ఫార్మర్‌ కూడా కాలిపోయిందని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్‌లోని మేధావులు, తెదేపా ఘనాపాఠీలు ఎక్కడికి పోయారు? వారికి చేతకాలేదా? అని మండిపడ్డారు. తాను ఈ సభలో చెప్పిన విషయాలను ప్రజలు ఇక్కడే వదిలేయకుండా బస్తీలు, గ్రామాల్లోకి వెళ్లాక చర్చకుపెట్టాలని సూచించారు. తాను చెప్పింది అబద్ధమైతే తమ అభ్యర్థులకు డిపాజిట్‌ రాకుండా ఓడ గొట్టాలని, ఒకవేళ తాను చెప్పింది నిజమైతే ప్రత్యర్థులకు డిపాజిట్‌ రాకుండా చేసి బుద్ధి చెప్పాలన్నారు. ప్రజలు ఓట్లు వేసేది వాస్తవాల పునాదులపై ఉండాలి తప్ప కులం, మతం పునాదులపై కాదన్నారు.

Next Story
Share it