Top
Sneha TV

చంద్రబాబూ! నేను ప్రశ్నిస్తున్నా, నీలా ఢిల్లీలో తోక తిప్పుతానని చెప్పను: దులిపేసిన కేసీఆర్

X

ఖమ్మం

ఖమ్మం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఖమ్మం బహిరంగ సభలో సోమవారం నాడు నిప్పులు చెరిగారు. చంద్రబాబు రూపంలో మనకు పెద్ద డెంజర్ రాబోతుందని ప్రజలను హెచ్చరించారు. గోదావరి నది పారే ఖమ్మం జిల్లాలో కరువు ఎలా ఉంటుందని ప్రశ్నించారు.

టీడీపీ అభ్యర్థులకు బీఫారాలు, నందమూరి సుహాసిని ఆస్తులు ఇవే, భర్త సంపాదన 'నిల్'

ఈ కాంగ్రెస్, టీడీపీ మేధావులు ఖమ్మం జిల్లాను ఎందుకు ఎండబెట్టారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పాత్రికేయులను ఉద్దేశించి.. ఖమ్మం జిల్లాకు జరిగిన అన్యాయాన్ని పత్రికల్లో రాయాలని కోరారు. జర్నలిస్టులకు నేను చేతులెత్తి నమస్కరించి వీటిని ఇక్కడి ప్రజలకు తెలియజేయాలని కోరుతున్నానని చెప్పారు. మన వద్ద ఏ ప్రాజెక్టుకు అయినా నెహ్రూ, ఇందిరా గాంధీ పేర్లు అన్నారు.

సమాధానం ఇవ్వాలి
చెంప చెల్లుమనేలా సమాధానం ఇవ్వాలి

మన గొప్ప నాయకులైన కొమురం బీం వంటి వారి పేర్లు లేవని కేసీఆర్ అన్నారు. దుమ్ముగూడెం టేల్ పాండ్, పోలవరం ప్రాజెక్టులు ఖమ్మం జిల్లాను ముంచి ఆంద్రాకు నీళ్లు తీసుకు వెళ్లే ప్రాజెక్టులు అన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఏడు మండలాలను చంద్రబాబు లాక్కున్నారని విమర్శించారు. కూటమి ముసుగులో వచ్చే వారికి ప్రజలు చెంప చెల్లుమనిపించేలా సమాధానం ఇవ్వాలన్నారు. తుమ్మల కారణంగా ఇక్కడి చెరువులు నిండాయని, మిగతా ప్రాంతాలు నిండాలంటే సీతారామ ప్రాజెక్టు పూర్తి కావాలన్నారు.

సమాధానం చెప్పాకే రావాలి
చంద్రబాబు సమాధానం చెప్పాకే రావాలి

ఈ సీతారామ ప్రాజెక్టు పూర్తి కాకుండా ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారన్నారు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆయన ఢిల్లీకి లేఖలు పంపించారని చెప్పారు. అలాంటి చంద్రబాబు ఖమ్మం జిల్లాకు ప్రచారానికి వచ్చే ముందు సమాధానం చెప్పి రావాలన్నారు. లేదంటే ప్రజలు టీడీపీ తరఫున పోటీ చేస్తున్న నామా నాగేశ్వర రావు, సండ్ర వెంకట వీరయ్య, ఇతర టీడీపీ నేతలను నిలదీయాలన్నారు. టీడీపీ తరఫున జిల్లాలో ముగ్గురు పోటీ చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు కేంద్రానికి రాసిన లేఖను వెనక్కి తీసుకుంటారా లేదా అని ప్రజలు టీడీపీ అభ్యర్థులను నిలదీయాలన్నారు.

మీ కంటిని మీ చేత్తో పొడుస్తా అంటూ బాబు అడుగుతున్నారు
మాకు ఓటు వేయండని చంద్రబాబు చెబితే వినేందుకు గొర్రెలమా

సీతారామ ప్రాజెక్టు పూర్తి కానివ్వం, కానీ మాకు మాత్రం ఓట్లు వేయమని చంద్రబాబు, టీడీపీ సభ్యులు అంటున్నారని, అలా చెబితే ఓటు వేసేందుకు మనం ఏమైనా గొర్రెలమా అని కేసీఆర్ అన్నారు. సీతారామ ప్రాజెక్టును వ్యతిరేకించే వారిని మనం గెలిపిద్దామా అన్నారు. మీ కంట్లో మీ వేలితోనే పొడుస్తానని, మీ సీతారామ ప్రాజెక్టును పూర్తి కానివ్వనని, కానీ ఓటు మాత్రం వేయమని చంద్రబాబు చెబుతున్నారని, అలాంటి టీడీపీకి ఓటేద్దామా అన్నారు. మన ప్రాజెక్టులు ఆఫేవారు, మనకు నీల్లు రాకుండా చేసేవారు ఓటు ఎలా అడుగుతారని ప్రశ్నించారు.

నేను ప్రశ్నిస్తున్నా
ఖమ్మం జిల్లా తరఫున నేను ప్రశ్నిస్తున్నా

మనకు అర్థమై కూడా, అర్థం కానట్లు నటిస్తే మన బతుకులు వ్యర్థమవుతాయని, మనం నష్టపోతామని కేసీఆర్ చెప్పారు. గత ఎన్నికల్లో తెరాస నుంచి పోటీ చేసిన వారు ఒక్కరే గెలిచారని, కానీ తెరాస ప్రభుత్వం వచ్చిందని, ఇప్పుడు ఖమ్మం ప్రజలు వివేకవంతంగా ఆలోచించాలని చెప్పారు. ఖమ్మం జిల్లా ప్రజల తరఫున నేను చంద్రబాబును ప్రశ్నిస్తున్నానని, నీకు నీతి, నిజాయితీ ఉంటే సీతారామ ప్రాజెక్టుపై కేంద్రానికి రాసిన లేఖను విరమించుకున్న తర్వాతే ఇఖ్కడ ప్రచారానికి రావాలన్నారు. తెరాస అధినేతగా, తెలంగాణ బిడ్డగా నిన్ను నిలదీస్తున్నానని చెప్పారు. ప్రజల గురించి, రైతుల గురించి ఆలోచించలేదు కాబట్టే కాంగ్రెస్, టీడీపీలు రైతు బంధు పథకం తీసుకు రాలేదన్నారు.

తోక తిప్పుతానని చెప్పను
ఢిల్లీలో చక్రం తిప్పు, తోక తిప్పుతానని చెప్పను

జాతీయస్థాయిలో కూడా తెరాస కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ చెప్పారు. తెరాస జాతీయ రాజకీయాల్లోకి వెళ్లవలసిన అవసరం ఉందని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు దేశ రాజకీయాల్లో విఫలమయ్యాయని చెప్పారు. ఎన్నో ఆశలతో మోడీకి అధికారం ఇస్తే ఆయన ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ప్రజలకు ఆయన ఏం చేసింది లేదన్నారు. అధికారాన్ని కేంద్రీకృతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రాలను హస్తగతం చేసుకుంటున్నారని, డిక్టేటర్ షిప్ పాలన ఉందని చెప్పారు. అందుకే జాతీయ రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రంట్ అవసరమని చెప్పారు. దాని గురించి తాను ఇప్పటికే కొంత ప్రయత్నం చేశానని, ఢిల్లీలో చక్రం తిప్పుతానని, తోక తిప్పుతానని తాను మాటలు చెప్పనని చంద్రబాబును ఉద్దేశించి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీలు ఫెయిలయ్యాయి కాబట్టి జాతీయ రాజకీయాల్లో మనం సరైన పాత్ర పోషించాల్సి ఉందన్నారు. ఎన్నికల తర్వాత కేంద్ర రాజకీయాల్లో కీలకం కానున్నామని చెప్పారు.

Next Story
Share it