Top
Sneha TV

భారత్‌-చైనా భాయి.. భాయి ...

X

బీజింగ్‌ : భారత్‌-చైనా సంబంధాల్లో కీలకమైన అడుగు పడింది. ఇరు దేశాల మధ్య అపోహలూ, అపార్థాలను తొలగించి స్నేహపూర్వక సంబంధాలు మెరుగుపర్చేందుకు బీజింగ్‌లో బుధవారం రెండు దేశాల విదేశాంగ శాఖల ప్రతినిధి బృందాల మధ్య వ్యూహాత్మక చర్చలు ప్రారంభమయ్యాయి. జైష్‌ ఎ మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజహర్‌ను ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదిగా ప్రకటించే విషయంలోనూ, అణు సరఫరా దేశాల బృందం(ఎన్‌ఎస్‌జి)లో భారత్‌ ప్రవేశానికి సంబంధించి రెండు దేశాల మధ్య ఏర్పడిన విభేదాల పరిష్కారానికి ఈ చర్చలు దోహదపడనున్నాయి. చర్చల్లో పాల్గొన్న భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్‌.జైశంకర్‌ నాయకత్వం వహిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రెండు ఇరుగుపొరుగు దేశాల మధ్య అపరిష్కృతంగా వున్న సమస్యలను పరిష్కరించుకోవడంపై ఉభయ పక్షాలూ దృష్టి సారించాల్సి అవసరముందన్నారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యి మాట్లాడుతూ ఈ చర్చలు రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాల్ని పెంపొందించుకునేందుకు, అపార్థాల్ని తగ్గించుకునేందుకు తోడ్పడతాయన్నారు. మసూద్‌ అజహర్‌ను ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి గుర్తించాలంటే అందుకు తగిన ఆధారాలు చూపాల్సి వుందని తాము మొదట్నించీ చెప్తున్నామని, ఇప్పుడూ అదే వైఖరితో వున్నామని చైనా విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. నిర్థిష్ట ఆధారాలు లేనప్పుడు ఏకాభిప్రాయం ద్వారానే పరిష్కరించు కోవాలని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు ఇంతకు ముందు తెలిపారు.

ఎన్‌ఎస్‌జిలో భారత్‌ సభ్యత్వ విషయాని కొస్తే అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం(ఎన్‌పిటి)పై సంతకాలు చేయని దేశాలు ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం పొందాలంటే కొన్ని నిబంధనలను ఆమోదించాల్సి వుందని, అదే విషయాన్ని తాము ఉద్ఘాటిస్తున్నామని ఆయన చెప్పారు.

Next Story
Share it