Top
Sneha TV

మూడేళ్ల క్రితంనాటి మాంసం వడ్డిస్తున్నారు!

X

కుళ్లిన ఆహారం తిని మరణించిన ఇద్దరు పిల్లలు

కరాచీ (పాకిస్థాన్‌): కరాచీలో ఓ ఉన్నత స్థాయి రెస్టారెంట్‌ అది. దాని పేరు అరిజోనా గ్రిల్‌ రెస్టారెంట్‌. ఇటీవల ఇందులో భోజనం చేసిన ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో ఈ రెస్టారెంట్‌ వార్తల్లోకెక్కింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ రోజు రాత్రి ఈ రెస్టారెంట్‌లో భోజనం చేసి ఇంటికి వెళ్లిన ఓ కుటుంబంలో ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఆహారం తిన్న పిల్లలకు తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు అవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మరణించారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. ఫుడ్‌ పాయిజన్‌ అయిందని అనుమానించిన పోలీసులు ఆహారశాఖ అధికారుల సాయంతో సదరు రెస్టారెంట్‌, దాని గోదాంలో సోదాలు నిర్వహించగా.. మూడేళ్ల నుంచి నిల్వ ఉంచుతున్న 80 కిలోల మాంసాన్ని గుర్తించారు. శీతలీకరణ యంత్రాల్లో ఉంచిన దీన్నే వండి, వినియోగదారులకు వడ్డిస్తున్నట్లు గుర్తించారు. రెస్టారెంట్‌ను సీజ్‌ చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

అయితే దీనిపై రెస్టారెంట్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ''మేము ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన, పోషక విలువలు ఉన్న ఆహారాన్నే మా వినియోగదారులకు అందిస్తాం. ఇవే మా మనుగడకు పునాదిరాళ్లు. మా ఈ విధానాలను మేం గర్వంగా చెప్పుకొంటాం. మా రెస్టారెంట్‌లో సోదాలు నిర్వహించి ఈ దుర్వార్తకు కారణమైన మూలాన్ని కనుగొనేందుకు దర్యాప్తు జరుపుతున్న పోలీసులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. పిల్లల మరణానికి మేం ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం'' అని ప్రకటనలో వివరించినట్లు డాన్‌ పత్రిక పేర్కొంది.

Next Story
Share it