Top
Sneha TV

వీపు చింతపండు అవుతుందనే, ఉత్తమన్నా! నీ అంత తెలివిలేదు: కేటీఆర్, జానాపై జగదీశ్వర్

X

హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఓ తెల్ల కాగితం అని, ఏం రాసిస్తే అది చదువుతారని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి (ఆపద్ధర్మ) కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం అన్నారు. 67 ఏళ్లు అవకాశమిస్తే కాంగ్రెస్, టీడీపీలు ఏం చేశాయని ప్రశ్నించారు.

అందరూ వెయిటింగ్: సుజయ, 'దాడి గురించి జగన్‌కు ముందే తెలుసు, అందుకే అలా'

నాలుగేళ్లలో మేం చేసిన అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పదవుల కోసం తెలంగాణకు అన్యాయం జరిగినా పెదవులు మూసుకున్న వాళ్లు తెలంగాణ కాంగ్రెస్ నేతలు అని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని, రాష్ట్రం ఇవ్వకుంటే వీపు చింతపండు అవుతుందని భయపడ్డారని, అందుకే తెలంగాణ వచ్చిందన్నారు.

ఎవరికీ భయపడేది లేదు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని, తెలంగాణ ప్రజలు పోరాటం చేసి సాధించుకున్నారని కేటీఆర్ చెప్పారు. తాము ఎవరికీ భయపడేది లేదని, ప్రజలే తమకు బాస్‌లు అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఢిల్లీలో, టీడీపీకి ఓటేస్తే అమరావతిలో బాస్‌లు ఉంటారని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని చెప్పారు. రైతుల కన్నీళ్లు తుడవాలనే నీళ్లకు కేసీఆర్ తొలి ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణానికి కాంగ్రెస్ అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. రైతులకు నీరు ఇవ్వాలనేదే తమ ప్రయత్నమని చెప్పారు.

ఉత్తమన్నా.. నీ అంత తెలివితేటల్లేవు

తనకు పొగరు ఎక్కువ అని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారని, అలాగే తెలివి లేదని అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. ఉత్తమన్నా.. అవును నాకు నీ అంత తెలివితేటలు లేవన్నా, కారు ఇంజిన్లో రూ.3 కోట్లు దాచుకునే తెలివి నాకు లేదని ఎద్దేవా చేశారు. తనకు పొగరు ఎక్కువ లేదు కానీ పౌరుషం మాత్రం ఉందని చెప్పారు. తాను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని చెప్పారు.

మోడీ జపాన్లో ఉంటే కేసీఆర్ ఎలా కలిశారు?

నిన్న కేసీఆర్ ఢిల్లీకి వెళ్తే ఆయన ఏదో ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు వెళ్లారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, కానీ అప్పుడు మోడీ జపాన్లో ఉన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలు అవాస్తవాలు మాట్లాడుతున్నారని చెప్పారు. 67 ఏళ్లు అవకాశమిస్తే కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణకు చేసింది ఏమీ లేదన్నారు.

కాంగ్రెస్ ప్రజలకు చేయిస్తే, బీజేపీ చెవిలో పూవు పెట్టింది

కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తు ఇస్తే ఈ డెబ్బై ఏళ్లుగా ప్రజలకు ఆ పార్టీ చేయి ఇచ్చిందని, బీజేపీ గుర్తు పువ్వు అని, అధికారంలోకి వచ్చాక నరేంద్ర మోడీ ప్రజల చెవుల్లో పువ్వు పెట్టారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు దూసుకు వెళ్లేందుకే ఇచ్చారని చెప్పారు. మనం సర్పంచ్ ఎన్నికల్లో ఎలాగైతే దగ్గర ఉండి మరీ ఓట్లు వేయించుకుంటామో ఇప్పుడు అలాగే చేయాలన్నారు.

టీడీపీ పుట్టిందే తెలుగువారి ఆత్మగౌరవం కోసం

సూర్యాపేట జిల్లాలో టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబు కుట్రలో కాంగ్రెస్ పార్టీ బందీ అయిందన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిందే టీడీపీ అన్నారు. అటువంటి టీడీపీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో అంట కాగుతోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే 2014కు ముందే పరిణామాలే పునరావృతం అవుతాయని హెచ్చరించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని సొంత పార్టీ వారే నమ్మడం లేదన్నారు. జానారెడ్డి ఏమి చెబుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే సిండికేట్ల రాజ్యం వస్తుందని చెప్పారు.

Next Story
Share it