Top
Sneha TV

ఏపీ పోలీసులకు తెలంగాణలో ఏం పని?: పల్లా

X

హైదరాబాద్: ఏపీ డీజీపీ కార్యాలయాన్ని అడ్డాగా చేసుకొని ఎన్నికల్లో గెలిచేందుకు కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇదే విషయంపై ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నేతలు గట్టు రామచంద్రారావు, దండే విఠల్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష పార్టీల నేతలు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన పల్లా రాజేశ్వర్ రెడ్డి.. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో చంద్రబాబు కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ.. ఏపీ పోలీసులను తెలంగాణకు పంపారని ఆరోపించారు. ఆ అధికారులు సర్వేల పేరు మీద తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతూ కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. శుక్రవారం నాడు ధర్మపురిలో ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుంటే కొంతమంది వారిని పట్టుకుని.. వారి వివరాలు అడిగితే సమాధానం చెప్పలేదన్నారు. దీంతో స్థానికులు వారిని పోలీసులకు అప్పగించారని పల్లా తెలిపారు. వారిని విచారించగా ఏపీకి చెందిన పోలీసులుగా తేలిందన్నారు. ఏపీ పోలీసులకు తెలంగాణలో ఏం పని అని పల్లా ప్రశ్నించారు. ఇదే విషయమై ఏపీ ప్రభుత్వాన్ని వివరణ కోరాలని సీఈఓకు విజ్ఞప్తి చేశామని చెప్పారు. చంద్రబాబు చేస్తున్న కుట్రలకు కాంగ్రెస్ నేతలు సిగ్గులేకుండా వత్తాసు పలుకుతున్నారని నిప్పులు చెరిగారు. తెలంగాణ పోలీసులు ఏపీ పోలీసులపై చర్యలు తీసుకోవాలని పల్లా డిమాండ్ చేశారు. లేకపోతే.. తాము ఊరుకునేది లేదని హెచ్చరించారు. అన్ని నియోజకవర్గాల్లో ఆరుగురు చొప్పున ఏపీ పోలీసులను నియమించి డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు కుట్రలను తెలంగాణ ప్రజలు సహించబోరన్నారు.

ఇదిలాఉంటే.. మహాకూటమి నేతలు సీఈఓను కలిసి తమ వాహనాలు తనిఖీ చేయవద్దంటూ వింత కోరికలు కోరారని పల్లా విమర్శించారు. దురదృష్టవశాత్తు వారి కార్లలో డబ్బులు దొరికాయని అన్నారు. టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణ అనుచరుడు వల్లభనేని అనీల్ కారులో రూ.50 లక్షలు దొరికాయని, ఇకపోతే గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కారులో రూ.3 కోట్లు దొరికిన విషయం తెలిసిందేనని పేర్కొన్నారు. నగరంలో ఏపీ మంత్రులకు కేటాయించిన క్వార్టర్స్ దుర్వినియోగం అవుతున్నాయని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఏపీ మంత్రులకు కేటాయించిన ఆ క్వార్టర్స్‌ని రమణ వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. వాటిని క్లబ్‌ లాగా మార్చి గబ్బు లేపుతున్నారని, దానిపైనా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరామని పల్లా తెలిపారు

Next Story
Share it