Top
Sneha TV

రూ. 4వేల కోట్లు కోల్పోయిన యెస్‌బ్యాంక్‌

X

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రైవేటు రంగ యెస్‌బ్యాంక్‌ లాభాలు క్షీణించడం ఆ కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావం చూపించింది. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో బ్యాంకు షేర్లు భారీగా పతనమయ్యాయి. దీంతో యెస్‌ బ్యాంక్‌ తన మార్కెట్‌ విలువలో రూ. 4వేల కోట్లకు పైగా కోల్పోయింది.

సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు రూ. 964.7 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ ఆర్జించిన రూ.1,002.73 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 3.8 శాతం తక్కువ. కాగా.. లాభాలు తగ్గడంతో బ్యాంకు షేరు విలువ తీవ్రంగా పడిపోయింది. మార్కెట్‌ ఆరంభం నుంచే నష్టాల్లో కదలాడిన షేరు చివరకు భారీగా పతనమైంది. నేటి సెషన్‌లో బీఎస్‌ఈలో షేరు ధర 8.97శాతం తగ్గి రూ. 180.55గా స్థిరపడింది. ఇంట్రాడేలో 14.99శాతం తగ్గి రూ. 168.60గా నమోదైంది. ఇక ఎన్‌ఎస్‌ఈలోనూ షేరు ధర 8.64శాతం పడిపోయి రూ. 181.20గా ముగిసింది.

షేరు ధర తగ్గడంతో కంపెనీ తన మార్కెట్‌ విలువ రూ. 4,076.02కోట్లు కోల్పోయి రూ. 41,721.98కోట్లకు పడిపోయింది. ఈక్విటీ గణాంకాల ప్రకారం.. బీఎస్‌ఈలో 84.45లక్షల యెస్‌ బ్యాంక్‌ షేర్లు ట్రేడ్‌ అయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో 9కోట్లకు పైగా షేర్లు చేతులు మారాయి

Next Story
Share it