Top
Sneha TV

"మనం సైలెంట్‌గా ఉంటే...వాళ్లు వయలెంట్‌గానే":మావోయిస్టులపై కిడారి భార్య సంచలన వ్యాఖ్యలు

X

విశాఖపట్టణం:జనం మౌనంగా ఉన్నంత కాలం మావోయిస్టులు హింసకు పాల్పడుతూనే ఉంటారంటూ ఇటీవల మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు భార్య పరమేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్యే కిడారితో పాటు మావోయిస్టులు కాల్చి చంపిన మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ సంతాపసభలో పాల్గొన్న ఆమె తీవ్ర ఉద్వేగంతో మాట్లాడారు. తొలిసారిగా బహిరంగంగా ప్రజల సమక్షంలో మాట్లాడిన ఆమె ఈ సందర్భంగా మావోయిస్టులపై విమర్శలు...ప్రశ్నల వర్షం కురిపించారు. సేవాభావం ఉన్న తన భర్తను మావోయిస్టులు ఎందుకు చంపారో సమాధానం చెప్పాలన్నారు.

అరకులోయలోని ఎన్టీఆర్‌ మైదానంలో జరిగిన సివేరి సోమ సంస్మరణ సభలో మావోయిస్టులను ఉద్దేశించి కిడారి పరమేశ్వరి మాట్లాడుతూ..."మనంసైలెంట్‌గా ఉన్నంత కాలం మావోయిస్టులు వయలెన్స్‌ చేస్తూనే వుంటారు. నా భర్త ఆదివారం కూడా కుటుంబాన్ని కాదని, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి గ్రామాల్లో పర్యటించే వారు...ఎక్కువ సమయం ప్రజల మధ్యనే గడపడానికి ఇష్టపడేవారు. అటువంటి సేవాభావం ఉన్న తన భర్తతోపాటు మాజీ ఎమ్మెల్యే సోమను మావోయిస్టులు ఎందుకు హత్య చేశారు?''...అని ప్రశ్నించారు.

ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మౌనాన్ని వీడి, ధైర్యంగా నోరు విప్పి గట్టిగా సమాధానం చెప్పాలని పరమేశ్వరి ప్రజలకు పిలుపునిచ్చారు. మనం నిశ్శబ్దంగా వుంటే ఇటువంటి సంఘటనలు మరిన్ని జరుగుతాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారాలు ఇచ్చే వారు అటువంటి పనులు మానుకోవాలని ఆమె హెచ్చరించారు.

ఇదే సభలో పాల్గొన్న రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబు మాట్లాడుతూ గిరిజనాభివృద్ధిని అడ్డుకోవడానికే మావోయిస్టులు ఇద్దరు ప్రజా ప్రతినిధులను పొట్టనబెట్టుకున్నారని అన్నారు. అరకులోయలోని ఎన్టీఆర్‌ మైదానంలో దివంగత మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమ సంస్మరణ సభ బుధవారం నిర్వహించారు. గిరిజన ప్రాంత అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న కిడారి, సోమలను అమానుషంగా మావోలు కాల్చిచంపడం గిరిజన అభివృద్ధిని అడ్డుకోవడమేనన్నారు. దీనిపై పౌరహక్కుల నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. వారు మౌనం వీడి ఈ ఘటనపై మాట్లాడాలని కోరారు.

తప్పు చేస్తే శిక్షించటానికి చట్టాలున్నాయని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. గిరిజన బతుకుల్లో వెలుగులు నింపేందుకు కృషి చేసిన సీవేరి సోమ, కిడారి సర్వేశ్వరరావుల ఆశయాలను అందరూ నెరవేర్చాలన్నారు. గిరిజన ప్రాంత అభివృద్ధి కోసమే కిడారి టిడిపిలో చేరారన్నారు. ఏజెన్సీలో ఏ కుంభకోణాలు జరిగాయో మావోలు చెప్పాలని మంత్రి డిమాండ్‌ చేశారు. అభివృద్ధి పనుల కోసమే ఏజెన్సీలో ఏడు నల్లరాయి క్వారీలు జరుగుతున్నాయని...మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలు జరగడం లేదని స్పష్టం చేశారు.

Next Story
Share it