Top
Sneha TV

ఆడపడుచులకు 'పసుపు- కుంకుమ'

X

+ తక్షణం మంజూరుకు చర్యలు
+ వచ్చేనెల 15లోగా పంపిణీ చేయకుంటే చర్యలు
+ తిత్లి పరిహారానికి నగదు సిద్దం చేయండి
.. బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సిఎం చంద్రబాబునాయుడు
విజయవాడ: రాష్ట్రంలోని ఆడపడుచులకు 'పసుపు-కుంకుమ' పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన లబ్దిదారులకు వచ్చేనెల 15లోగా నగదును చెల్లించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్యాంకర్లకు నిర్దేశించారు. 'పసుపు- కుంకుమ చివరి విడతగా స్వయం సహాయక సంఘాల మహిళలు ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున మొత్తం రు.1814 కోట్లు విడుదల చేశామని సిఎం తెలిపారు. 'పసుపు- కుంకుమ పొందే 86 లక్షల మంది లబ్దిదారులకు బ్యాంకర్లు సకాలంలో నగదు చెల్లించకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరగా నగదు పంపిణీ పూర్తి చేయకుంటే బ్యాంకుల వద్ద నిరసన తెలపాల్సింగా స్వయం సహాయక సంఘ సభ్యులకు పిలుపునిస్తానని సిఎం హెచ్చరించారు. 'పసుపు- కుంకుమ కింద విడుదల చేసిన నగదు ఏ బ్యాంకు వద్ద ఎంత వుంది, పంపిణీలో ఏ బ్యాంక్‌ అలసత్వం వహిస్తుందో ఆ సమాచారాన్ని వెంటనే అందించాలని సెర్ప్‌, మెప్మా అధికారులను సిఎం ఆదేశించారు. బుధవారం సచివాలయంలో 204వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాన్ని ముఖ్యమంత్రి నిర్వహించారు.
తిత్లి పరిహారానికి సన్నద్దంకండి..
తిత్లి బాధితులకు పరిహారం సవ్యంగా అందేలా, నగదు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మొత్తాన్ని సిద్దం చేసుకోవాలని సిఎం బ్యాంకర్లకు సూచించారు. తిత్లి తుఫాన్‌ ప్రభావిత ప్రాంతంలో పాడైపోయిన కరెన్సీ నోట్ల స్థానంలో కొత్తవి ఇవ్వాలని, పంట రుణాలు రీషెడ్యూల్‌ చేయాలని సిఎం స్పష్టం చేశారు. తిత్లి తుపాన్‌ వచ్చిన పదిరోజుల్లోనే బాధితులకు పరిహారం అందించేలా తాము వ్యవస్థను తీర్చిదిద్దామన్నారు. బ్యాంకులు కూడా ఇదే తరహా వేగాన్ని అందింపుచ్చుకోవాలన్నారు. రుణాల పంపిణీ నుండి పరిహారం చెల్లింపు వరకు అన్నీ ఆన్‌లైన్‌ చేయడం ద్వారా త్వరితగతిన లబ్ది చేకూర్చవచ్చన్నారు. తిత్లి తుఫాన్‌కు చలించి దేశవిదేశాల నుండి ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆన్‌లైన్లో విరాళాలిచ్చేందుకు ముందుకొస్తున్న వారికి సాంకేతిక సహకారం అందించాలన్నారు. విదేశీ విరాళాల కోసం ఇంటర్నేషనల్‌ గేట్‌వే ఏర్పాటుకు బ్యాంకర్లు అంగీకరించారు.

పేదవారికి పెద్ద ఆస్థి ప్రభుత్వం నిర్మించే ఇల్లు...
ప్రభుత్వం నిర్మించే ఇల్లు పేదవారికి పెద్ద ఆస్ధిగా వుండాలనేది తన ఆశయమని, అందుకే పేదలకు నిర్మించే గృహసముదాయాలకు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి అద్బుతంగా మౌలిక వసతులను కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. దేశంలో మరెక్కడా లేనట్లుగా లక్షలాది ఇళ్లను పేదలకు నిర్మిస్తున్న ఘనత ఆంధ్రప్రదేశ్‌కు దక్కుతుందన్నారు. ఇందుకు బ్యాంకులు కూడా సంపూర్ణ సహకారం అందించాలన్నారు.

వ్యవసాయ రుణాల్లో చేరిన లక్ష్యం 30.53%.
వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా వ్యవసాయ రంగానికి ఈ ఏడాది రు.1,01,564 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యం పెట్టుకోగా మొదటి త్రైమాసికంలో రు.31,007 కోట్లు బ్యాంకులందించాయి. వ్యవసాయ రుణాల లక్ష్యంలో 30.53% అధిగమించాయి. ఎంఎస్‌ఎంఈలకు తొలి త్రైమాసికంలో ఇచ్చిన రునాలు రు.9715 కోట్లు, సాధించిన లక్ష్యం 34.38%, మిగిలిన ప్రాధాన్య రంగాలకు తొలి త్రైమాసికంలో ఇచ్చిన రుణాలు రు.2,035 కోట్లు, సాధించిన లక్ష్యం 14.14%.గా వుంది. మొత్తం ప్రాధాన్య రంగాలకు తొలి త్రైమాసికంలో ఇచ్చిన రుణాలు రు.42,757 కోట్లు, సాధించిన లక్ష్యం 29.65%. ప్రాధాన్యేతర రంగాలకు తొలి త్రైమాసికంలో ఇచ్చిన రుణాలు రు.47234కోట్లు, సాధించిన లక్ష్యం 94.47%. మొత్తం రుణ ప్రణాళిక కింద ఈ ఏడాది రు.194220 కోట్లు రుణాలివ్వాలని లక్ష్యం పెట్టుకోగా తొలి త్రైమాసికంలోనే రు.89,991 కోట్లు రుణాలను బ్యాంకర్లు అందించి 46.33% లక్ష్యం సాధించారు.

కౌలు రైతులకు బారీగా రుణాలు..
ముఖ్యమంత్రి ఆశయాలకనుగుణంగా తొలిసారి కౌలు రైతులకు భారీ ఎత్తున బ్యాంకులు ఈసారి రుణాలిచ్చాయి. కౌలురైతులకు ఈ ఆర్ధిక సంవత్సరం రు.7500 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యం పెట్టుకోగా, మొదటి అర్ధసంవత్సరంలోనే 33.74% లక్ష్యం అధిగమించాయి. రాష్ట్రంలో 2,52,756 మంది కౌలురైతులకు రు.2,530.24 కోట్ల మేర రుణాలు అందించాయి. కౌలు రైతులకు అందించే విషయంలో స్టేట్‌బ్యాంక్‌ఆఫ్‌ ఇండియా, ఆంధ్రాబ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌ ముందున్నాయి.

ఉద్యానరంగానికి ఊతమివ్వండి.
రాష్ట్రంలో ఉద్యానవనరంగ విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని, సుమారు కోటి ఎకరాల్లో హార్టీకల్చర్‌కు ప్రోత్సాహం అందిస్తున్నామని సిఎం అన్నారు. ఉద్యాన రంగానికి రుణాలు పెద్ద ఎత్తున ఇవ్వడం వల్ల రుణాల రికవరి కూడా మెరుగుపడుతుందని బ్యాంకర్లకు సూచించారు. నిర్దేశిత రుణ ప్రణాళిక అనుగుణంగా బాంకులు లక్ష్యాలు పూర్తి చేయాలని, ఫలితాలు సాధించడం ముక్యమన్నారు. ప్రైవేట్‌ సెక్టార్‌ బ్యాంకులు కూడా వ్యవసాయ, ఇతర రుణాలిచ్చే విషయంలో ముందుకు రావాలన్నారు. ఐక్యరాజ్యసమితి సమావేశంలో సుస్థిర సేద్యానికి ఆర్ధిక చేయూత- అంతర్జాతీయ సవాళ్లు- అవకాశాలు అనే అంశంపై ముఖ్యమంత్రి ప్రసంగించి బ్యాంకర్ల అభినందనలు అందుకున్నారు.

Next Story
Share it