Top
Sneha TV

టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే ధైర్యం లేదు: కడియం

X

వర్ధన్నపేట (వరంగల్‌): టీఆర్‌ఎస్‌ను ఏ ఒక్క పార్టీ ఎదుర్కొనే గుండె ధైర్యం లేక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు వ్యతిరేకంగా పని చేసిన శక్తులన్నింటితో కాంగ్రెస్‌ జత కడుతుందని ప్రజలు గుణపాఠం చెపుతారని అపద్దర్మ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాలులో ఆదివారం ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశానికి మండల పార్టీ అధ్యక్షుడు మార్గం భిక్షపతి అధ్యక్షత వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అరూరి రమేష్‌ చేసిన అభివృద్ధి, ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి సీఎం కేసీఆర్‌ టికెట్‌ కేటాయించారన్నారు. అన్ని నదులు కలిసి గోదావరి పవిత్ర నదిగా ఆవిర్భవించిందో టీఆర్‌ఎస్‌ పార్టీ సైతం అలాంటిందని అభివర్ణించారు. కేసీఆర్‌ రాజకీయల్లో బాహుబలి అన్నారు. కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి వస్తే అవినీతి తిరిగి పురుడు పోసుకుంటుందన్నారు.

దేశంలో ఏ రాష్ట్రం ఏ ప్రభుత్వం చేపట్టని అభివృద్ధి పనులు చేపట్టి పార్లమెంట్‌ సాక్షిగా సాక్షాత్‌ ప్రధాని నరేంద్రమోదీ కేసీఆర్‌ను మెచ్చుకున్నారని గుర్తు చేశారు. 70 ఏళ్ల కాంగ్రెస్, ఇతర పార్టీల పాలనలో కరంటు కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. రెండు నెలలు కార్యకర్తలు కష్టపడితే ఐదేళ్లు రమేష్‌ మీకు సేవకుడిగా పని చేస్తారన్నారు. లక్షకు పైగా మెజారిటీ సాధించాలంటే కార్యకర్తలు, నాయకులు క్రమశిక్షణతో ప్రజల్లోకి వెళ్లాలన్నారు. అత్యధిక మెజారిటీ సాధిస్తే రాబోయే ప్రభుత్వంలో మరింత గౌరవ ప్రదమైన స్థానం అరూరి రమేష్‌కు కల్పించబడుతుందన్నారు.

తాజా మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌ మాట్లాడుతూ తనను వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు ఆదరించి 86 వేలపై చిలుకు ఓట్ల భారీ మెజారిటీతో గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తన వంతు అభివృద్ధి సహాయ సహకారాలు అందించానన్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో కొందరు వ్యక్తులు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని, వాటిని కార్యకర్తలు తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందుకు ప్రతి గ్రామం నుంచి సోషల్‌ మీడియా ఇన్‌చార్జిలు వాటిని తిప్పి కొట్టి తగిన సమాధానం చెప్పాలన్నారు. రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్, టీఆర్‌ఎస్‌ యువజన విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఇండ్ల నాగేశ్వర్‌రావు, ఎంపీపీ మార్నేని రవీందర్‌రావు, జెడ్పీటీసీ పాలకుర్తి సారంగపాణి, ఐనవోలు ఆలయ చైర్మన్‌ గజ్జెల్లి శ్రీరాములు, ఆర్మవైశ్య ప్రముఖుడు, జిల్లా నాయకుడు శ్రీనివాస్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Next Story
Share it