Top
Sneha TV

'కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ అవసరం లేదు'

X

హైదరాబాద్‌ : ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ తేదీల ఖరారుపై తమకు ఎలాంటి సమాచారం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ తెలిపారు. ఈ విషయమై తమను సంప్రదించాల్సిన అవసరం కేంద్ర ఎన్నికల సంఘానికి లేదని వ్యాఖ్యానించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తైతే ఆటోమేటిక్‌గా కేంద్ర ఎన్నికల కమిషన్ తగిన నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఓటరు నమోదు ప్రక్రియ వేగంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఓటరు నమోదుపై రెండు రోజుల స్పెషల్‌ డ్రైవ్‌ పూర్తైందన్నారు. ఎన్నికల అవగాహనపై ప్రతిరోజు కలెక్టర్లతో సమీక్షిస్తున్నట్లు తెలిపారు.

చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..
ఫలానా అభ్యర్థికే ఓటు వేయాలంటూ ఓటర్ల చేత బలవంతంగా తీర్మానాలు, ప్రతిజ్ఞలు చేయిస్తున్నట్టు తమ దృష్టికి వస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రజత్‌కుమార్‌ హెచ్చరించారు. అయితే ఇప్పటివరకైతే అటువంటి ఫిర్యాదులేమీ అందలేదన్నారు. కొత్తగా ప్రవేశపెడుతున్న వీవీప్యాట్‌లపై చాలా మంది అధికారులకు అవగాహన లేని కారణంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అదే విధంగా పోలింగ్‌ బూత్‌లలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Next Story
Share it