Top
Sneha TV

దిల్లీ ఎయిమ్స్‌కు గోవా సీఎం పారికర్‌

X

పనాజీ: అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోవా సీఎం మనోహర్ పారికర్‌ మెరుగైన వైద్యం కోసం నేడు దిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రికి వెళ్లనున్నారు. ఈ ఉదయం పారికర్‌ ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్తారని గోవా సీఎంవో కార్యాలయం తెలిపింది. ఈ ప్రత్యేక విమానాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది.

కాగా.. పారికర్‌ ఆరోగ్య సమస్యల దృష్ట్యా తరచూ ఆయన విధులకు సెలవు పెట్టాల్సి వస్తోంది. దీంతో పాలనా వ్యవస్థ దెబ్బతింటోందని ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. వెంటనే గోవాలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలని డిమాండ్‌ చేస్తోంది. మరోవైపు సీఎం బాధ్యతల నుంచి పారికర్‌ కూడా తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే ప్రధాని మోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో చర్చించినట్లు సమాచారం.

ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం తాను సీఎంగా కొనసాగలేనని పారికర్.. మోదీ, అమిత్‌షాలను చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రిని మార్చడం కాస్త కష్టమని, అందుకే తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు సీఎంగా కొనసాగాలని పారికర్‌కు అమిత్‌షా సూచించినట్లు తెలుస్తోంది.

ప్యాంక్రియాటిక్‌ సమస్యతో బాధపడుతున్న పారికర్‌ ప్రస్తుతం గోవాలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గతంలో ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలోనూ చికిత్స తీసుకున్న ఆయన.. అమెరికాకు కూడా వెళ్లి మూడు నెలలపాటు వైద్యం తీసుకున్నారు

Next Story
Share it