Top
Sneha TV

అసెంబ్లీ పదనిసలు:ప్రశ్నిస్తే...బిజెపి పై ఫైర్...స్వపక్షంపై సెటైర్

X

అమరావతి:శాసనసభ సమావేశాలను ప్రధాన ప్రతిపక్షం వైసిపి బాయ్ కాట్ చేయడం, టిడిపితో వైరం నేపథ్యంలో ఇప్పుడు బిజెపి నే సభలో అధికారపక్షాన్ని దుయ్యబట్టే పని చేపట్టింది.

ఈ నేపథ్యంలో మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో పలు ఆసక్తికర ఘట్టాలు చోటుచేసుకుంటున్నాయి. యువనేస్తం కార్యక్రమం అమలులో జాప్యాన్ని నిలదీసిన బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ పై మంత్రి అచ్చెన్నాయుడు పరుషైన పదజాలంతో విరుచుకుపడటం చర్చనీయాంశం అయింది. అలాగే అధికార పార్టీ ఎమ్మెల్యే పీతల సుజాత ప్రస్తావించిన ఒక సమస్యపై సంబంధిత మంత్రి సోమిరెడ్డి స్పందన, ఆ స్పందనపై మరో మంత్రి యనమల సంధించిన సెటైర్ సభలో నవ్వులు పూయించాయి.

గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు టిడిపి ప్రభుత్వం యువనేస్తం పేరుతో నిరుద్యోగ భృతి పథకాన్ని అక్టోబర్ 2 వ తేదీ నుంచి ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో ఈ పథకం గురించి బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ టిడిపి గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ఇంత ఆలస్యంగా ఇప్పుడు అమలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.

కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఇప్పుడు నిరుద్యోగ భృతిని అమలు చేయాలని చూస్తున్నారని, నిజానికిది నిరుద్యోగ భృతి కాదని ఎన్నికల భృతి అని మాధవ్ ఎద్దేవా చేశారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయని, ఈ విషయం తెలిసే టిడిపి రాజకీయ ప్రయోజన కోసం ఇంత ఆలస్యంగా ఈ పథకం ప్రారంభిస్తోందని, తద్వారా 6 నెలల మించి ఈ పథకం అమలయ్యే అవకాశం లేనందున ఆ మేరకు లెక్కలు కట్టి ఎన్నికల్లో లబ్ది పొందేందుకు టిడిపి ప్రభుత్వం పన్నిన పన్నాగంగా

మాధవ్ అభివర్ణించారు.

జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడితే చంపేస్తారా?...మీకు నచ్చకపోతే లేపేస్తారా?:టిడిపి నేతల ధ్వజం

అయితే నిరుద్యోగ భృతి "యువనేస్తం"పై బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ చేసిన విమర్శలపై మంత్రి అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు. బిజెపి నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, ఇలాంటి విమర్శలు చేయడానికి సిగ్గుండాలని పరుషమైన పదాలతో దుయ్యబట్టారు. ఎన్డీయే నుంచి టీడీపీ విడిపోవడంతోనే మాధవ్ విమర్శలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు ఆరోపించారు. కేంద్రం సాయంచేయకున్నా అభివృద్ది,సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే ఇలాంటి విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ మాధవ్ యువతను కించపరుస్తూ మాట్లాడరని ఆగ్రహం వ్యక్తం చేయగా, బీజేపీ నేతల విమర్శల్లో అర్థం లేదని సీఎం చంద్రబాబు విమర్శించారు.

అయితే ఇలా టిడిపి, బిజెపి సభ్యుల మధ్య మాటల యుద్దంతో వాడివేడిగా సాగుతున్న సభలో ఒక ఘటన నవ్వులు పువ్వులు పూయించింది. జీరో అవర్‌లో సందర్భంగా అధికార పార్టీ సభ్యుల మధ్యే చోటుచేసుకున్న ఈ సంఘటన, ఆ సందర్భంలో మంత్రి యనమల తోటి మంత్రి సోమిరెడ్డి వేసిన సెటైర్ ఇలా హాస్యానికి తావిచ్చింది. ఎమ్మెల్యే పీతల సుజాత మాట్లాడుతూ మెట్ట ప్రాంత రైతులకు బోర్లు, విద్యుత్‌ కనెక్షన్‌ల అంశంపై వివరాలు చెప్పవలసిందిగా అడుగగా, సంబంధిత మంత్రికి స్పీకర్‌ సూచించారు.

అయితే సభలోనే ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దీనికి గమనించనందునో ఏమో కొద్దిసేపటివరకూ స్పందించలేదు. అయితే అందరూ తనవైపే చూస్తుండటంతో పరిస్థితి అర్థమైనా సమస్య ఏమిటో తెలియక ఏమీ అర్ధం కానట్లు లేచి నిల్చున్నారు...అందరూ తన సమాధానం కోసం వేచి చూస్తుండటంతో "నోట్‌ చేసుకున్నాం...తగిన చర్యలు తీసుకుంటాం" అని చెప్పారు. ఈ తతంగాన్ని అంతటినీ గమనిస్తున్న మంత్రి యనమల మాట్లాడుతూ "అధ్యక్షా...మీరు కూడా నోట్‌ చేసుకోవాలి, ఇటువంటి మంత్రులందరినీ"...అంటూ సరదాగా సెటైర్ వేయడంతో స్పీకర్‌తో సహా సభ్యులందరూ ఒక్కసారిగా ఘొల్లుమన్నారు.

Next Story
Share it