తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు విజయ రంగరాజు కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. (విజయ రంగరాజు)
విజయ రంగరాజు అసలు పేరు రాజ్ కుమార్. ఆయన మద్రాసులో రంగస్థల కళాకారునిగా అనేక నాటకాలలో నటించారు. ఆ తర్వాత సినీ రంగానికి వచ్చారు. తెలుగుతో పాటు మలయాళ, తమిళ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా తెలుగులో ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా ఎంతో పేరు సంపాదించుకున్నారు. బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సీతా కళ్యాణం’ రంగరాజుకు నటుడిగా మొదటి సినిమా. అయితే నటుడిగా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం మాత్రం బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘భైరవ ద్వీపం’. ఈ సినిమాలో ఆయన నటనకు ఎంతో పేరు వచ్చింది. ఆ తర్వాత విజయ రంగరాజు కెరీర్ సెకండ్ టర్నింగ్ పాయింట్ అంటే ‘యజ్ఞం’ అని చెప్పవచ్చు. ఈ సినిమాలో విలన్ గా మెప్పించిన ఆయన, ఆ తర్వాత వరుస సినిమాలతో అలరించారు.