ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నటులు, దర్శకులు, నిర్మాతలు అందరూ కలిసి ఎఫ్ డీసీ తరపున పోలీస్ టవర్స్ లో గురువారం నాడు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవుతామని ఎఫ్ డీసీ చైర్మన్, నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఈ మేరకు బుధవారం సంధ్యా థియేటర్ తొక్కిసులాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను నిర్మాత అల్లు అరవింద్ తో కలిసి దిల్ రాజు పరామర్శించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. గురువారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ ఖరారు అయిందని అన్నారు. ఇప్పటికే సినిమా పరిశ్రమలోని పెద్దలందరికీ సమాచారం ఇచ్చామని తమతో పాటు ఎంత మంది వస్తే అంత మందితో సీఎంను కలుస్తామన్నారు. ఈ భేటీలో ప్రధానంగా తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై చర్చిస్తామన్నారు.
చిత్రపరిశ్రమ, ప్రభుత్వం మధ్య వారధిలా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి తనకు బాధ్యతలు అప్పగించారని, ప్రస్తుతం తాను అదే చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. త్వరలో హీరో అల్లు అర్జున్ తో కూడా భేటీ అవుతానని దిల్ రాజ్ తెలిపారు. సంధ్యా థియేటర్ తొక్కిసులాట ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ బాగానే ఉన్నాడని, ఆక్సీజన్ సపార్టు లేకుండా ఉన్నాడని దిల్ రాజ్ తెలిపారు. ఇదిలావుండగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తి అయ్యింది. అయితే ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి తెలుగు సినిమా పెద్దలు వ్యక్తిగతంగా కలిసే తప్పితే, పరిశ్రమ తరపున ఎవరు కలవలేదు. పైగా పరిశ్రమ సమస్యలను సీఎం దృష్టికి ఎవరూ తీసుకురాలేదు. అందుకే ప్రభుత్వం, సినీ పరిశ్రమకు మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారాన్ని ఖండించడానికే తాజాగా సినీ ప్రముఖులతో సీఎం భేటీ జరుగుతుందని అంటున్నారు.
అందరు కలిసి రూ.2 కోట్లు ఇస్తున్నాం – అల్లు అరవింద్
కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కుటుంబానికి రూ. 2 కోట్లు నష్టపరిహారం ఇస్తున్నట్లు నిర్మాత అల్లు అర్జున్ తెలిపారు. హీరో అల్లు అర్జున్ రూ. 1 కోటి, దర్శకుడు సుకుమార్ రూ.50 లక్షలు, పుష్ప 2 సినిమా నిర్మాతలు (మైత్రి మూవీస్) రూ. 50 లక్షలు ఇచ్చారని అల్లు అరవింత్ అన్నారు. ఈ మొత్తం రూ.2కోట్ల చెక్కును ఎఫ్ డీసీ చైర్మన్, నిర్మాత దిల్ రాజుకు అందజేశామన్నారు.
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఛార్జిషీట్ దాఖలు
వారి వేధింపులు ఆరోపణలపై అరెస్టు అయ్యి, బెయిల్ పై విడుదలైన సీనియర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (షేక్ జానీ భాషా) పై పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. బాధితురాలిపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడినట్లుగా తేల్చారు. మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ను మైనర్ గా ఉన్నప్పటి నుంచి వేధింపులకు గురిచేసిన బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో జానీ మాస్టర్ పై అత్యాచారం, ఫోక్సో చట్టాల కింద కేసులను పోలీసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.