సంధ్య థియేటర్ వద్ద ఘటన జరిగి 20 రోజులు పూర్తవుతున్నా.. దానికి సంబంధించి జరిగిన వివిధ పరిణామాల వల్ల అందరూ దాని గురించి చర్చించుకుంటున్నారు. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె కుమారు శ్రీతేజ్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈపై ఘటన పక్కన పెడితే బుధవారం అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, ఎఫ్డిసి ఛైర్మన్ దిల్‌రాజు కలిసి కిమ్స్ హాస్పిటల్‌కి వెళ్లారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రేవతి కుటుంబానికి ‘పుష్ప2’ యూనిట్ రూ.2 కోట్ల ఆర్థిక సాయం అందించి దానికి సంబంధించి చెక్కును కూడా దిల్‌రాజుకు అందించారు అల్లు అరవింద్. ఈ రెండు కోట్లలో అల్లు అర్జున్ ఒక కోటి, మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షలు, దర్శకుడు సుకుమార్ 50 లక్షలు ఉన్నాయి. రెండు కోట్ల రూపాయల చెక్కును దిల్‌రాజు అందించి రేవతి కుటుంబానికి ఆ సాయం అందజేయాల్సిందిగా అల్లు అరవింద్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ ‘నిన్న నేను కిమ్స్ హాస్పిటల్‌కి వచ్చి శ్రీతేజ్‌ను చూశాను. అతన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నాను. మళ్ళీ ఈరోజు అల్లు అరవింద్గారితో కలిసి వచ్చాను. నిన్నటికి, ఈరోజుకి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిలో ఎంతో మార్పు కనిపించింది. గత 72 గంటల్లో అతను బాగా కోలుకున్నాడని దిల్‌రాజు చెప్పారు. వెంటిలేషన్ తీసేసి చికిత్స చేస్తున్నారు. అల్లు అరవింద్‌గారు ఇచ్చిన రెండు కోట్ల చెక్‌ను భాస్కర్ కుటుంబానికి అందించడం జరుగుతుంది. రేపు ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిగారిని సినిమా ఇండస్ట్రీ సభ్యులతో కలవబోతున్నాం. ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి వారధిగా నేను ఉంటాననే నాకు ఈ పదవిని అప్పగించారు’ అన్నారు.