ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘పుష్ప-2’ ఫీవరే ప్రారంభమైంది. భారీ అంచనాలతో థియేటర్లలో అడుగుపెట్టిన పుష్ప-2.. సంచలన వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.829 గ్రాస్ రాబట్టింది. త్వరలోనే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరనుంది. ఈ వసూళ్ల జోరుని మరింత పెంచేలా ‘పుష్ప-2’ టీం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. (పుష్ప 2 రూల్)
తెలంగాణలో ‘పుష్ప-2’ ప్రీమియర్ షోలకు రూ.800 వరకు పెంచుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. అలాగే మొదటి నాలుగు రోజులు సింగిల్ స్క్రీన్స్ లో రూ.150, మల్టీప్లెక్స్‌లలో రూ.200 పెంచుకునే అవకాశం ఇచ్చారు. ఇక డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్స్ లో రూ.105, మల్టీప్లెక్స్ లో రూ.150 పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే పెంచుకునే అవకాశం ఉంటుంది, ఈరోజు(డిసెంబర్ 9) నుంచి ధరలను తగ్గించింది పుష్ప టీం. సింగిల్ స్క్రీన్స్ లో రూ.200, మల్టీప్లెక్స్ లో రూ.400గా టికెట్ రేట్లు చూపిస్తున్నాయి.
తెలంగాణ మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా టికెట్ ధరలు పెంచడానికి అనుమతి ఉంది. అయితే ఏపీలో కూడా వైజాగ్ లో తప్ప మిగిలిన అన్ని చోట్ల సింగిల్ స్క్రీన్స్ లో రూ.200, మల్టీప్లెక్స్ లో రూ.300 టికెట్ ధరలు ఉన్నాయి. అంటే రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అనుమతి లభించిన ధర కంటే తక్కువగానే పుష్ప-2 టిక్కెట్లు అందుబాటులోకి వచ్చాయి.
అధిక ధరలు కనిపించే ‘పుష్ప-2’ సినిమాని చూడటానికి అభిమానులు, ప్రేక్షకులు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. అందుకే మొదటి నాలుగు రోజులు ఆ స్థాయి వసూళ్లు వచ్చాయి. అయితే ఈ సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలంటే, ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ గ్యాంగ్ తో కలిసి వెళ్లాలనుకునేవారు.. టికెట్ ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూస్తున్నారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకునే, పుష్ప టీం టికెట్ ధరలను తగ్గించింది. ఈ నిర్ణయం వల్ల సినిమా చూస్తే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అదే జరిగితే వసూళ్ల పరంగా పుష్ప-2 మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయమనిపిస్తోంది.