కొన్నేళ్లుగా ప్రాంక్ వీడియోల ట్రెండ్ నడుస్తోంది. ప్రాంక్ వీడియోలు అంటే అందరూ నవ్వుకునేలా ఉండాలి కానీ.. కొందరిని భయపెట్టేలాగానో, కొందరి మనోభావాలు దెబ్బతీసేలాగానో ఉండకూడదు. కానీ వ్యూస్, మనీ మాయలో పడిపోయిన కొందరు ప్రాంక్ పేరుతో అడ్డమైన వీడియోలు చేస్తున్నారు. అలా చేసే వారిలో కొందరు సెలబ్రిటీలు కూడా ఉంటున్నారు.
బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ (ప్రియాంక జైన్) తన బాయ్ ఫ్రెండ్ శివ కుమార్ తో కలిసి యూట్యూబ్ లో వీడియోలు చూస్తున్నారు. అందులో వారి లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ తో పాటు, ప్రాంక్ వీడియోలు కూడా ఉంటాయి. అయితే వీరు వ్యూస్ కోసం తిరుమల నడక దారిలో కూడా ఒక ప్రాంక్ వీడియో చేశారు. “తిరుపతి మా మీద చీతా ఎటాక్” అంటూ ఒక థంబ్ నెయిల్ పెట్టి, 11 నిమిషాల వీడియో పెట్టారు. ఈ వీడియో పోస్ట్ చేసి దాదాపు ఎనిమిది నెలలవుతుంది. అప్పట్లోనే ఈ వీడియోపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మీరు తిరుమల వెళ్ళింది శ్రీవారిని దర్శించుకోవడానికా? లేక వీడియోలు చేసి సొమ్ము చేసుకోవడానికా? అంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. అలాగే “చీతా ఎటాక్” అంటూ తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులను భయబ్రాంతులకు గురిచేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అన్ని విమర్శలు వచ్చినప్పటికీ.. ఆ వీడియోని తొలగించడం కానీ, కనీసం థంబ్ నెయిల్ మార్చడం కానీ ప్రియాంక జైన్ చేయలేదు. కానీ ఎట్టకేలకు కాస్త ఆలస్యమైనా ఈ విషయం ఎవరి దగ్గరకు చేరాలో వారి దగ్గరకే చేరింది.
ప్రియాంక జైన్-శివ కుమార్ తిరుమల నడక దారిలో చేసిన ప్రాంక్ వీడియో విషయం టీటీడీకి చేరింది. తాజాగా టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి స్పందించారు. “ప్రాంక్ వీడియోలు హద్దూపద్దూ లేదా? , కఠిన చర్యలు తీసుకోవడం, వీటికి ఫుల్ స్టాప్ పెడతాం.” అన్నారు.