ముద్ర, తెలంగాణ బ్యూరో : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లోని బోయగూడ నర్సింగ్ కాలేజీ విద్యార్థులు పోరుబాట పట్టారు. ఈ మేరకు గురువారం గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న 800 మంది నర్సింగ్ విద్యార్థినిలు ఆసుపత్రి ముట్టడికి యత్నించారు. హాస్టల్‌లోని సమస్యలను పరిష్కరించాలని ఆసుపత్రిలో చికిత్స చేయలేకపోయారు. నర్సింగ్ కాలేజీలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలరోజులుగా హాస్టల్‌లో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.
సమస్యలను సంబంధిత అధికారులకు వివరించినా పట్టించుకోకపోవడం, పైగా రోజు రోజుకు సమస్య అధికమవడంతో విద్యార్థులు ఇతర ప్రాంతాలకు, స్వస్థలాలకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు వినతి పత్రం అందించారు. ఈ నెల 28న పరీక్షలు దగ్గరికి రావడంతో సెలవులు కావాలని, ఆ మురికి కంపు వాసనలో ఉండలేమని, మా ఊర్లోకి వెళ్లి పరీక్షలకు ప్రిపేర్ అవుతామని చెప్పడానికి గాంధీ ఆసుపత్రి వైద్య విభాగం సూపరింటెండెంట్ ప్రిన్సిపాల్ ఒప్పుకోవడం లేదని విద్యార్థులు చెప్పారు.