- పాదయాత్ర తో ప్రజల అభిప్రాయాల సేకరణ
- యాదాద్రి శ్రీ లక్ష్మీనారసింహుడి దర్శనంతో షురూ
- అన్ని జిల్లాల్లో ఉండేలా ప్లాన్
ముద్ర, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పాదయాత్ర చేసేందుకు సీఎం సిద్ధమయ్యారు. ఈ నెల 8న పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. మూసీ పునరుజ్జీవం యాత్రతో మూసీ పరివాహక ప్రజల వద్దకు వెళ్లనున్నారు. తన జన్మదినం నవంబర్ 8 నుంచి క్షేత్ర స్థాయి పర్యటనలకు సిద్ధమవుతున్నారు. అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలతో వరుసగా జిల్లా పర్యటనలు చేయనున్నారు సీఎం రేవంత్. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి సీఎం పర్యటన షురూ. ఈ నెల 8న కుటుంబ సమేతంగా యాదాద్రికి వెళ్లనున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం వైటీడీఏ, జిల్లా అధికారులతో ఆలయ అభివృద్ధి పనులపై రేవంత్ సమీక్షించారు. ఆ తర్వాత భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని బొల్లేపల్లి, సంగెం, భీమలింగం వంతెన వరకు సీఎం రేవంత్ మూసీ పునరుజ్జీవన ప్రజా చైతన్య పాదయాత్ర చేయనున్నారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేయనున్నారు సీఎం. తరువాత మల్లన్న సాగర్ నుంచి యాదాద్రి జిల్లాకు మంచినీటి సరఫరా కోసం నిర్మించనున్న పైప్ లైన్ ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేస్తారు. సీఎం ఏర్పాట్లను విప్ బీర్ల ఐలయ్య ప్రభుత్వ పర్యటనకు హాజరుకానున్నారు.
పాదయాత్ర ఎజెండా ఇదే..!
కాగా.. ఇటీవల మూసీకి సంబంధించి బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. అధికారంలో ఉన్నప్పుడే బీఆర్ఎస్ నేతలు మూసీ పునరుజ్జీవనం కోసం ప్రయత్నాలు చేయడం, మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు కూడా ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా ప్రాజెక్టు కోసం డిజైన్ కూడా చేశారు. అయితే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మూసీ ప్రక్షాళనే తప్పు అన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆందోళనను సీఎం తప్పుబట్టారు. మూసీ సుందరీకరణపై సూచనలు అందించారు.. అంతేకానీ ఈ ప్రాజెక్టును అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. మూసీ మురికిలో ఉండేందుకు ప్రజలెవరూ సుముఖంగా లేరన్నారు. అక్కడ వారికి న్యాయం చేయడానికి సూచనలు ఏమన్నా అందుబాటులో ఉన్నాయి.. కానీ ఆందోళనలు చేయడం తగదన్నారు. ప్రజలంతా మూసీని ప్రక్షాళన చేయాలనుకుంటున్నారని అన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాడపల్లి నుంచి తాను చేస్తున్న పాదయాత్రకు కలిసి రావాలని.. నల్గొండ జిల్లా ప్రజలు మూసీ ప్రక్షాళనను కోరుకుంటున్నారా లేదా అని వారినే అడిగి తెలుసుకుంటామని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి 8 నుంచి మూసీ పునరుజ్జీవన ప్రజా చైతన్య పాదయాత్రకు సిద్ధమయ్యారు