తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్. నవంబర్ 6వ తేదీ నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. వేసవి కాలం కాదు.. అలాంటప్పుడు హాఫ్‌డే స్కూల్స్ ఎందుకు పెడుతున్నారనే అనుమానం రావొచ్చు. దాని వెనుక ఓ కారణం ఉంది. ఈ నెల 6 నుంచి తెలంగాణలో కులగణన మొదలుకానుంది. సమగ్ర కులగణన కోసం 36,559 మంది సెకండరీ టీచర్లతో పాటు 3,414 మంది ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్లను నియమించింది. అలాగే మరో 8 వేల మంది ఇతర సిబ్బందిని కూడా ఈ ప్రక్రియలో భాగం చేసింది. ఇంత సర్వే పూర్తయ్యే వరకు ప్రైమరీ స్కూళ్లు ఒక్కపూటే నిర్వహించాలని నిర్ణయించారు.
కులగణన కోసం ఇంటింటికీ..
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు టీచర్లు స్కూళ్లలో పనిచేయాలి. అనంతరం కులగణన కోసం ఇంటింటికీ వెళ్లాలి. ప్రతి 150 ఇళ్లకు ఒక పర్యవేక్షణ అధికారితో పాటు కులగణన అధికారులను ప్రభుత్వం నియమించింది. 50 ప్రశ్నల ద్వారా డేటాను అధికారులు సేకరించారు. దీని కోసం వారికి ప్రత్యేకంగా కిట్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ నెల 13వ తేదీ వరకు కులగణన మీద ప్రజాసేకరణ ఉంటుందని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు.