ముద్ర, తెలంగాణ బ్యూరో :- అంబర్ పేట్ సాయిబాబా నగర్లో ఇటీవల హత్యకు గురైన వృద్ద దంపతులు లింగా రెడ్డి, ఊర్మిళ దేవి కుటుంబ సభ్యులను బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అంబర్ పేట్ సాయి బాబా నగరంలో ఎన్నో ఏళ్ల నుంచి ప్రజలు శాంతియుతంగా ఉంటున్నారు. కానీ ఇటీవల లింగారెడ్డి, ఊర్మిళ దేవిని పట్టపగలే అతి దారుణంగా చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ నగరంలో ప్రతి మనిషినీ.. ఈ జంట హత్య కలిచివేసిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్లోని అనేక చోట్ల 10 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది.. బస్తీ, బస్తీకి సీసీ కెమరాలు పెట్టాం అన్నారు. అలాగే శాంతి భద్రతల విషయంలో ఎక్కడా రాజీపడలేదని కేటీఆర్ పేర్కొన్నారు. తమ హయాంలో పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పని చేయండని చెప్పారు. శాంతి భద్రతలు బాగుంటే రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయని కేటీఆర్ తెలిపారు. ఇప్పటి వరకూ లింగారెడ్డి, ఊర్మిళ జంట హత్య కేసును పోలీసులు చేధించలేకపోయారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డే అని గుర్తు చేశారు.