- రాష్ట్ర సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ
- రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సోనియాగాంధీ
- అదే రోజు వరంగల్‌లో కాంగ్రెస్ రైతు కృతజ్ఞత సభ
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 20 లేదా 24న రాష్ట్రానికి రానున్న ఇరువురు అగ్రనేతలు రాష్ట్ర సచివాలయం ముందు ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత అదే రోజు వరంగల్‌లో నిర్వహించతలపెట్టిన రైతు కృతజ్ఞత సభలో పాల్గొననున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పంట రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేసిన కాంగ్రెస్ సర్కార్.. వరంగల్‌లో రైతు కృతజ్ఞతకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వరంగల్ సభ నిర్వహణ గురించి మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆగస్టు 15లోగా రుణమాఫీ పూర్తి చేసి వరంగల్ లో కృతజ్ఞత సభ నిర్వహించామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆగస్టు 15న ఆ ప్రక్రియ ముగియడంతో సభ నిర్వహణపై కసరత్తు చేసిన సీఎం.. దానికి సోనియా, రాహుల్ గాంధీని ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆగస్టు 15న ఢిల్లీకి వెళుతున్న సీఎం.. శుక్రవారం వారిని కలిసి సభకు రావాలని ఆహ్వానించారు. దీంతో ఈ నెల 20 లేదా 24న ఏదో ఒక తేదీలో సభ పెట్టాలని అగ్రనేతలు సీఎంకు సూచించినట్లు తెలిసింది. దీంతో ఆ మేరకు ప్రభుత్వం సభ ఏర్పాట్లలో నిమగ్నమైంది.