- ఇరువురి మద్య కీలక చర్చలు
- ఈ నెల 19న సింఘ్వీ నామినేషన్
- అదే రోజు సీఎల్పీ సమావేశం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పరిచయం
ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డితో ఢిల్లీలో భేటీ అయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానం ఆయన పేరును ఖరారు చేయగా రేవంత్ రెడ్డిని సింఘ్వి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో ఇరువురు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఈ మేరకు ఈ నెల 18న పీసీసీ అధ్యక్షుడి హోదాలో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు హోటల్లో సీఎల్పీ సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఆ సమావేశంలో అభిషేక్ సింఘ్వీని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పరిచయం చేయడంతో పాటు ప్రభుత్వ నిర్ణయాలు, భవిష్యత్ కార్యచరణపై చర్చించాలని సీఎం కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాజ్యసభ ఎన్నికకు సంబంధించి సింఘ్వీ ఒక్కరే నామినేషన్ వేస్తే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.కానీ కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన స్థానం కావడంతో బీఆర్ఎస్ నుంచి అభ్యర్థిని బరిలోకి దింపిన కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై సీఎల్పీలో చర్చించే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి.