అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు భారతీయులు మరణించారు. టెక్సాస్ రాష్ట్రం అన్నాలోని రోడ్డు నెం.75లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. ముగ్గురు హైదరాబాద్ కు చెందినవారు. ఒకరు చెన్నైకి చెందిన వారిగా పేర్కొన్నారు. శుక్రవారం చోటుచేసుకున్న ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రోడ్డు ప్రమాదంలో గుర్తించిన వారిలో హైదరాబాద్కు చెందిన ఆర్యన్ రఘునాథ్ ఓరంపాటి(27), ఫరూక్ షేక్ (30), లోకేష్ పాలచర్ల (28) ఉండగా.. మరో వ్యక్తి తమిళనాడుకు చెందిన దర్శిని వాసిదేవన్ (25)గా గుర్తించారు. వీరంతా కలిసి బెన్టోన్విల్లె కోసం వెళ్లేందుకు కార్ పూలింగ్ యాప్ ద్వారా కలిశారు. డల్లాస్ లో బంధువులను కలిసి ఇంటికి వెళ్తున్న ఆర్యన్ రఘునాథ్, భార్యను కలిసేందుకు లోకేశ్, యూనివర్శిటీకి వెళ్తున్న దర్శిని వాసుదేవన్, ఫరూఖ్ ఒకే కారులో వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వెనకనుంచి వచ్చిన ఐదు కార్లు ఒకదానికొకటి అతివేగంగా ఢీకొనడంతో ప్రమాదం సంభవించినట్లు అక్కడి అధికారులు గుర్తించారు.
వీరు ప్రయాణిస్తున్న వాహనానికి మంటలు అంటుకోవడంతో బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది. వీరి మృతదేహాలు గుర్తుపట్టని విధంగా మంటల్లో కాలిపోయాయి. దీనితో కార్ పూలింగ్ యాప్లో నమోదైన వివరాల ప్రకారం మృతుల పేరు, వివరాలను అక్కడి అధికారులు గుర్తించారు.