- హైడ్రా దాడులపై బీజేపీ సింగిల్ గానే ఉద్యమిస్తుంది
- కుటుంబ వారసత్వ పార్టీలంటేనే అవినీతికి కేరాఫ్ అడ్రస్
- తమిళనాడులో తండ్రి సీఎం…కొడుకు డిప్యూటీ సీఎం
- కుటుంబ పార్టీల్లో కార్యకర్తలకు ముఖ్య పదవులివ్వరా?
- కుటుంబ, వారసత్వ పార్టీలను బొంద పెట్టండి
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
ముద్రా ప్రతినిధి, కరీంనగర్ :అవినీతి, కుటుంబ రాజకీయాలు, వారసత్వం విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దొందూదొందేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడితే, మూసీ సుందరీకరణ పేరుతో రూ.లక్షన్నర కోట్ల అప్పు తెచ్చి అవినీతికి తెరతీస్తోందన్నారు. అయ్యప్ప సొసైటీ అక్రమాల కూల్చివేత పేరుతో హడావుడి చేసిన బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడితే…. ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు హైడ్రా కూల్చివేతల పేరుతో సంపన్నుల నుంచి వసూళ్లు చేస్తున్న తంతుకు తెరదీశారని అన్నారు. హైడ్రా పేరుతో పేద, మధ్య తరగతి ప్రజల ఇండ్లను కూల్చివేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈ విషయంలో బీజేపీ ప్రజలకు ఆయుధంగా మారబోతోందని, తమ ప్రాణాలను అడ్డు పెట్టి అయినా ప్రజల ఆస్తులను కాపాడతామన్నారు. తమ ప్రాణాలను తీసిన తరువాత పేదల ఇండ్లపైకి హైడ్రా దాడులు చేసుకోవాలన్నారు. హైడ్రా తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. ఈరోజు కరీంనగర్ లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ హైడ్రామా, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అవినీతిపై నిప్పులు చెరిగారు. తమిళనాడులో డీఎంకే కుటుంబ రాజకీయాలను సైతం తూర్పారపట్టారు. ఏమన్నారంటే….
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అవినీతితో కంపు కొడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరుతో మరో రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి తెరతీసింది. జీతాలకే పైసల్లేక అల్లాడుతుంటే మూసీ ప్రక్షాళన పేరుతో అప్పు తెచ్చి దోచుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రజల చేతికి చిప్ప చేతికిచ్చి బిచ్చగాళ్లను చేసే పరిస్థితికి తీసుకొస్తున్నారు.
చెరువులు, కుంటలను అక్రమించి సంపన్నులు నిర్మించిన భవనాలను హైడ్రా కూల్చివేస్తుందని భావించినం. కానీ పేద, మధ్య తరగతి ప్రజల ఇండ్లను కూల్చి వాళ్లకు నిలువ నీడలేకుండా చేస్తోంది. హైడ్రా తీరు చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కొరివితో తలగొంటుంది. ప్రభుత్వమే అన్ని అనుమతులిచ్చిన తరువాత బ్యాంకు లోన్లు తీసుకుని ప్రజలు ఇండ్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఇండ్లను కూల్చి నిలువ నీడలేకుండా చేస్తే ప్రజలు ఏమైపోవాలి? ఎట్లా బతకాలి? హైడ్రా తీరును చూసి దేశవ్యాప్తంగా జనం అసహ్యించుకుంటున్నారు.
ఇదేనా ఇందిరమ్మ పాలన అంటే… ప్రజలకు నిలువ నీడ లేకుండా చేయడమే ఇందిరమ్మ పాలనా?. పేదల గొంతు నొక్కడమే ఇందిరమ్మ పాలనా? 6 రంటీలను అమలు చేయకుండా మోసం చేయడమే ఇందిరమ్మ పాలనా?ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అయ్యప్ప సొసైటీ కూల్చివేత పేరుతో పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడింది. ఇయాళ హైడ్రా పేరుతో కాంగ్రెస్ వసూళ్లకు తెరదీస్తోంది. సంపన్నుల నుండి వసూళ్లు చేస్తూ. ఢిల్లీకి కప్పం కడుతున్నరు. ఇకనైనా ఇట్లాంటి రాక్షస, దుర్మార్గపు ఆలోచనలను మానుకోండి. మీ గుండె మీద చేయి వేసుకుని ఆలోచించండి. మీరు కట్టుకున్న ఇండ్లను మీ కళ్ల ముందే కూల్చివేస్తే ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి.
పేదల ఇండ్లను కూలిస్తానంటే ఒప్పుకోం. హైడ్రా దాడులను అడ్డుకుంటాం. ప్రజలకు బీజేపీ ఆయుధం కాబోతోంది. మా ప్రాణాలను అడ్డుపెట్టి అయనా సరే ప్రజల ఆస్తులను కాపాడుతాం. పేదల ఇండ్లను కూల్చాలంటే ముందు మా ప్రాణాలను తీసేయండి. ఆ తరువాత పేదల ఇండ్లపైకి వెళ్లండి. ఈ విషయంలో బీజేపీ సింగిల్ గానే కదిలిస్తుంది. వారం రోజుల్లో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో యాక్షన్ ప్లాన్ ను ప్రకటించి అమలు చేయబోతున్నాం.
కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే పార్టీలన్నీ కుటుంబ వారసత్వ పార్టీలే. తమిళనాడులో సీఎం స్టాలిన్ తన కొడుకును డిప్యూటీ సీఎం చేయడం సిగ్గు చేటు. ఆయా పార్టీల కార్యకర్తలారా… మీ పార్టీలో కష్టపడే నాయకులు, కార్యకర్తలకు ముఖ్యమైన పదవులు ఇచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో వారసత్వ రాజకీయాల పరంపర కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ లో నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ… ఇలా వారసత్వ రాజకీయాలే నడుస్తున్నాయి. గాంధీ పేరు పెట్టుకుని ఆయన ఆలోచనలకు భిన్నంగా ఉన్నారు. గాంధీ బతికుంటే వీళ్లను చూసి ఎంతో బాధపడేవారు. కుటుంబ పార్టీలను బొందపెట్టండి.బీజేపీ వారసత్వ, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకం. కష్టపడే కార్యకర్తలను, జెండా మోసిన కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దే పార్టీ. రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు గుణపాఠం చెప్పాలని కోరుతున్నానన్నారు.