- అధికారుల్లో తీవ్ర ఆందోళన
- గాలింపు చర్యలు ముమ్మరం
వాయనాడ్: వయనాడ్లో సహాయక చర్యలు ముందుకుసాగే కొద్దీ ఆందోళనకర విషయాలు వెల్లడవుతున్నాయి. తాజాగా 600 మంది వలస కార్మికుల ఆచూకీ గల్లంతైంది. దీనికి తోడు స్థానికంగా మొబైల్ ఫోన్ నెట్వర్క్ కూడా దెబ్బతినడం సమస్యను మరింత తీవ్రంగా మార్చింది. ముండకై ప్రాంతంలో ఉన్న తేయాకు, కాఫీ, యాలకుల తోటల్లో పనిచేసేందుకు పశ్చిమ బెంగాల్, అస్సాం నుంచి వందల మంది కార్మికులు వస్తుంటారు. ఇక్కడి హారిసన్ మలయాళీ ప్లాంటేషన్ లిమిటెడ్లో పనిచేయడానికి దాదాపు 600 మంది వచ్చారు. వీరంతా ముండకైలోనే నివాసం ఉంటున్నారు. తాజాగా కంపెనీ జనరల్ మేనేజర్ బెనిల్ జోన్స్ మాట్లాడుతూ ”మా కార్మికులతో ఇప్పటి వరకు సంప్రదించలేకపోయాం. దీనికి తోడు మొబైల్ ఫోన్ నెట్వర్క్ కూడా పనిచేయడం లేదు” అని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
స్థానికుల కథనం ప్రకారం ఈ ప్రాంతంలోని నాలుగు వీధుల్లో 65 కుటుంబాలు ఉండే ప్రాంతాల్లో నిన్న కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆ మొత్తం ఇళ్లు ధ్వంసమైనట్లు చెబుతున్నారు. చలియార్ నదిలో తేలియాడుతున్న మృతదేహాలు.. మరోవైపు వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటనకు సంబంధించి చాలా మృతదేహాలు మల్లప్పురం చలియార్ నదిలో తేలియాడుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి దూరంగా దాదాపు 11 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో చాలా వాటికి శరీర భాగాలు లేవు. ఈ రకంగా కొట్టుకొచ్చిన మూడేళ్ల పాప మృతదేహం స్థానికులను కలచివేసింది.అటవీ ప్రాంతంలో ఐదు మృతదేహాలు కొట్టుకు వచ్చినట్లు స్థానిక ఆదివాసీలు తెలిపారు. ఎమ్మెల్యే ఐసీ బాల కృష్ణన్ కూడా నదిలో అనేక శవాలు తేలుతున్నట్లు ధ్రువీకరించారు. కాల్పెట్టా ఎమ్మెల్యే సిద్ధిఖీ మాట్లాడుతూ ముండకై గ్రామంలో పరిస్థితి ఊహించిన దానికన్నా భయానకంగా ఉండొచ్చని పేర్కొన్నారు. బాధితులకు సాయం చేయడానికి నౌకాదళానికి చెందిన 30 మంది గజ ఈతగాళ్లను రప్పించారు. మరోవైపు రెండు ఎయిర్ఫోర్స్ హెలికాప్టర్లను రంగంలోకి దించారు. 200 మంది సైనిక సిబ్బంది కూడా పనిచేస్తున్నారు.