అంతర్జాతీయం

30 ఏళ్లుగా సౌదీ యువరాజుగా చెలామణీ

మూడు దశాబ్దాలుగా సౌదీ అరేబియాకు చెందిన యువరాజుగా చెలామణీ అవుతూ, కోట్ల రూపాయల మోసం చేశాడు ఫ్లొరిడాకు చెందిన వ్యక్తి. ఇప్పుడా మోసం బయటపడి 18 ఏళ్లపాటు జైల్లో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది.

48 ఏళ్ల ఆంథోనీ జిగ్నాక్‌ గత మూడు దశాబ్దాలుగా సౌదీ యువరాజు ఖలీద్ బిన్‌ అల్ సౌద్‌నంటూ అందరిని మోసం చేశాడు. ఫ్లొరిడాలోని మియామీ ఫిషర్ ద్వీపంలో నివసిస్తూ నకిలీ డిప్లొమాటిక్‌ లైసెన్స్‌ ప్లేట్‌తో ఫెరారీలో తిరిగేవాడు. అతడి చుట్టూ నకిలీ డిప్లొమాటిక్‌  కాగితాలు పట్టుకొని పెద్ద సంఖ్యలో బాడీగార్డులు ఉండేవారు. తాను డబ్బులు పెట్టుబడి పెడతానని, తనతో చేరాలనుకున్న వారు ఆ డబ్బును తన ఖాతాలో  వేయాలని ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమందిని నమ్మించాడు. యువరాజు మాటలను నమ్మని వారుంటారా? చాలామంది ప్రజలు దాదాపు  8 మిలియన్‌ డాలర్ల(రూ.55,66,36,800)ను ఆయన ఖాతాకు తరలించారు. అంత డబ్బు తీసుకొని ఈ నకిలీ రాజు తెగ ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాడు. ప్రైవేటు జెట్లు, బోట్ రేసింగ్‌లు, డిజైనర్ దుస్తులకు దాన్ని ఉపయోగించాడు.

ఇలా దాదాపు మూడు దశాబ్దాలు పాటు కొనసాగిన మారువేషం ఓ తప్పిదం కారణంగా బయటపడింది. ముస్లింలు పోర్క్‌ ఉత్పత్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ తమ చెంతకు రానీయరు. అయితే జిగ్నాక్‌ అది పెద్దగా పట్టించుకోవట్లేదని ఓ రియల్ ఎస్టేట్ డెవలపర్‌ గుర్తించి, బయటపెట్టాడు. దాంతో జిగ్నాక్‌ను 2017 నవంబరులో పోలీసులు అరెస్టు చేశారు. విచారణ అనంతరం అతడికి 18 సంవత్సరాల జైలు శిక్ష పడింది. దాంతోపాటు మోసపూరితంగా నకిలీ పత్రాలు వాడినందుకు కూడా అతడిపై అభియోగాలు నమోదయ్యాయి.