‘అ!’, ‘కల్కి’, ‘జాంబీ రెడ్డి’ వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ.. ‘హనుమాన్’తో సంచలన విజయాన్ని సాధించి, పాన్ ఇండియా వైడ్ గా తన పేరు మారుమోగిపోయేలా చేసుకున్నాడు. అయితే ఈ సినిమా వచ్చి ఏడాది దాటినా ఇంతవరకు ప్రశాంత్ వర్మ కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. దీంతో ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్, తన ప్రైమ్ టైంను వేస్ట్ చేసుకుంటున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. (ప్రశాంత్ వర్మ)
‘హనుమాన్’ విడుదలకు ముందు నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు కళ్యాణ్‌ని హీరోగా పరిచయం చేస్తూ ‘అధీర’ను ప్రకటించాడు ప్రశాంత్ వర్మ. కానీ ‘హనుమాన్’ సక్సెస్ తర్వాత ‘అధీర’ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకొని, ‘హనుమాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’పై ఫోకస్ పెట్టాడు. కానీ ఆ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించకముందే బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో ‘బ్రహ్మ రాక్షస’ను ప్రకటించాడు. సెట్స్ మీదకు వెళ్ళాక ఆ సినిమా ఏవో కారణాల వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నట్లు ప్రకటన వచ్చింది. నందమూరి వారసుడు మోక్షజ్ఞను లాంచ్ చేసే బాధ్యత రావడం నిజంగా గొప్ప విషయం. దీంతో ప్రశాంత్ మరింత గొప్ప పేరు సంపాదించుకోవడం ఖాయమని అందరూ భావించారు. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. మోక్షజ్ఞ-ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. ప్రాజెక్ట్ ఆగిపోలేదని మేకర్స్ నుంచి ప్రకటన వచ్చినప్పటికీ.. అసలు ఈ ప్రాజెక్ట్ ఉందో లేదో? ఉంటే ఎప్పుడు మొదలవుతుందో? అనే క్లారిటీ లేదు. ఇదిలా ఉండగా మళ్ళీ ‘జై హనుమాన్’ సినిమాలో కాస్త కదలిక వచ్చింది. ఇందులో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హనుమంతుడిగా నటించినట్లు తెలుపుతూ పోస్టర్ ను విడుదల చేశాడు ప్రశాంత్. కానీ ప్రస్తుతం రిషబ్.. ‘కాంతార’ ప్రీక్వెల్ తో ప్రస్తుతం ఉన్నాడు. ఆ తర్వాత ‘జై హనుమాన్’తో పాటు ‘ఛత్రపతి శివాజీ’ ప్రాజెక్ట్ లైన్‌లో ఉంది. ఈ రిషబ్ తన ఫుల్ ఫోకస్ ను ‘జై హనుమాన్’పై ఎప్పుడు పెడతాడు అంటే దానిపై స్పష్టత లేదు.
మొత్తానికి “అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని” అన్నట్టుగా ప్రశాంత్ వర్మ పరిస్థితి ఉంది. నిజానికి ప్రశాంత్ కి మంచి ప్రతిభ ఉంది. దానికి తోడు కెరీర్ ప్రారంభంలోనే ‘హనుమాన్’ వంటి పాన్ ఇండియా సక్సెస్ అందుకోవడం మామూలు విషయం కాదు. కానీ ఆ తర్వాత ప్రశాంత్ వేస్తున్న అడుగులు గందరగోళంగా ఉన్నాయి. ‘హనుమాన్’ తర్వాత ‘బ్రహ్మ రాక్షస’, మోక్షజ్ఞ డెబ్యూ మూవీ లేదా ‘జై హనుమాన్’.. వీటిలో ఏది వెంటనే మొదలైనా బాగుండేది. కానీ కొన్ని ప్రాజెక్ట్‌లు ఆగిపోతున్నాయి, ఎప్పుడో మొదలవుతాయో తెలియట్లేదు.
సాధారణంగా కొందరు సక్సెస్ తలకెక్కి, వచ్చిన మంచి అవకాశాలను చేజార్చుకుంటూ ఉంటారు. మరికొందరు ఒక భారీ సక్సెస్ తర్వాత, ఎలాంటి ప్రాజెక్ట్ ముందు మొదలుపెట్టాలో తెలియక తికమక పడుతుంటారు. మరి వీటిలో ప్రశాంత్ వర్మను వెనక్కి లాగుతున్న అంశమేంటో తెలియాలి.
కాగా ప్రశాంత్ రచయితగా కూడా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల ఆయన స్టోరీ అందించిన ‘దేవకీ నందన వాసుదేవ’ పరాజయం పాలైంది. అలాగే తేజ సజ్జా హీరోగా రూపొందించబడిన ‘జాంబీ రెడ్డి-2’కి కూడా ప్రశాంత్ స్క్రిప్ట్ అందించిన సమాచారం. ఓ వైపు వరుస సినిమాలను దర్శకుడిగా, మరోవైపు రచయితగా పని చేస్తూ.. ప్రత్యేకంగా ఒక ప్రాజెక్ట్ మీద అంటూ ఫుల్ ఫోకస్ పెట్టలేకపోతుండటం వల్లనే.. సినిమాలు సెట్స్ కి వెళ్ళట్లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. మరి ప్రశాంత్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్, ఇకనైనా తన ప్రైమ్ టైన్ని వేస్ట్ చేసుకోకుండా, ఇంకా త్వరగా కొత్త ప్రాజెక్ట్‌ని ఎక్కిస్తాడేమో చూడాలి.