వందలాది మంది శ్రమ, వందల కోట్ల బడ్జెట్ తో రూపొందించబడిన సినిమా థియేటర్లలో విడుదలైన కొద్ది గంటల్లోనే పైరసీ ప్రింట్ అందుబాటులోకి రావడం మూవీ టీంకి ఎంతో బాధ కలిగిస్తుంది. ఇక ఇటీవల విడుదలైన ‘గేమ్ ఛేంజర్’ (గేమ్ ఛేంజర్) సినిమా విషయంలో ఆ టీం బాధ మాటల్లో వర్ణించలేనిది. ఎందుకంటే మూవీ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే HD ప్రింట్ పైరసీ సైట్స్ లో అందుబాటులోకి రావడంతో పాటు, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు కొందరు కేబుల్ ఛానల్స్ లో మరియు బస్సులలో దీనిని చూపిస్తున్నారు. ఇప్పటికే ఈ పైరసీ ఘటనపై ‘గేమ్ ఛేంజర్’ టీం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక తాజాగా ఈ ఘటనపై మెగా కుటుంబానికి సన్నిహితుడు, నిర్మాత ఎస్.కె.ఎన్ స్పందించారు.
“కేవలం 4-5 రోజుల క్రితం విడుదలైన ఒక చిత్రం స్థానిక కేబుల్ ఛానెల్‌లు మరియు బస్సులలో ప్రసారం కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. సినిమా అంటే కేవలం హీరో, దర్శకుడు లేదా నిర్మాతలు కాదు. ఇది 3-4 సంవత్సరాల కృషి, అంకితభావం మరియు వేలాది మంది కలల ఫలితం.
సినిమాల విజయంపై జీవిస్తున్న డిస్ట్రిబ్యూటర్లు మరియు ఎగ్జిబిటర్లపై ఎంత ప్రభావం చూపిస్తుందో ఆలోచించండి. ఇలాంటి చర్యలు వారితో పాటు, చిత్ర పరిశ్రమ భవిష్యత్తుకు ముప్పు కలిగిస్తాయి
ఇటువంటి చర్యలకు ముగింపు పలికేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సినిమాకి మంచి భవిష్యత్తును అందించడానికి , సినిమాని కాపాడటానికి అందం ఏకమవుదాం.” అంటూ సోషల్ మీడియా వేదికగా ఎస్.కె.ఎన్ ఆవేదన వ్యక్తం చేశారు.