దుబాయ్‌లో జరిగిన 24 గంటల కార్ రేస్‌లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. అజిత్ టీం మూడో స్థానంలో నిలిచి భారత్‌కు గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఈ సందర్భంగా భారత జాతీయ పతాకంతో అభిమానులకు అభివాదం చేశారు అజిత్. ఈ రేస్ కోసం అజిత్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతని కార్ యాక్సిడెంట్‌కి గురి కావడం అందరికీ ఆందోళన కలిగించింది. కారు బాగా దెబ్బతిన్నప్పటికీ అజిత్ మాత్రం క్షేమంగా బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు సంచలనం సృష్టించాయి. కార్ రేస్‌లో విజయం సాధించి మూడో స్థానంలో నిలిచిన అజిత్ టీమ్‌కి అభినందనల వెల్లువ మొదలైంది. అభిమానులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అజిత్ కుమార్ రేసింగ్ అనే రేసింగ్ టీమ్‌కు యజమాని. సెప్టెంబర్ 2024లో దీన్ని ప్రారంభించిన ఆయన, ప్రస్తుతం పోర్షే 992 పోటీతో పాటు, ఆసియా ఫార్ములా బిఎండబ్ల్యు ఛాంపియన్‌షిప్, బ్రిటిష్ ఫార్ములా 3 ఛాంపియన్‌షిప్ మరియు ఎఫ్‌ఐఈ ఫార్ములా 2 ఛాంపియన్‌షిప్‌లలో కూడా పాల్గొంటున్నారు. ఇవి పూర్తి కావడానికి దాదాపు 9 నెలలు పడుతుంది. కాబట్టి ఈ 9 నెలల షూటింగ్‌లోనూ పాల్గొనబోనని అజిత్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం అజిత్, మగిజ్ తిరుమేని దర్శకత్వంలో ‘విడముయార్చి’ చిత్రం, ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాలు పూర్తి చేసి కొన్నాళ్ళపాటు సినిమాలకు దూరంగా ఉండబోతున్నారు అజిత్. తన తదుపరి సినిమా లోకేష్ కనకరాజ్ లేదా వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తారని తెలుస్తోంది. అయితే 9 నెలల తర్వాత ఎవరి సినిమా చేస్తారనే వివరాలు తెలుస్తాయి.