Home సినిమా రాజమౌళి సెంటిమెంట్‌ని బ్రేక్‌ చేసిన ఏకైక హీరో ఎన్టీఆర్! – Sneha News

రాజమౌళి సెంటిమెంట్‌ని బ్రేక్‌ చేసిన ఏకైక హీరో ఎన్టీఆర్! – Sneha News

by Sneha News
0 comments
రాజమౌళి సెంటిమెంట్‌ని బ్రేక్‌ చేసిన ఏకైక హీరో ఎన్టీఆర్!


తెలుగు సినిమా స్టామినా ఏంటి అనేది ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. అంతర్జాతీయ స్థాయి మార్కెట్‌ని పెంచడంలో రాజమౌళి చేసిన కృషి అంతా ఇంతా కాదు. 2001లో స్టూడెంట్ నెం.1 నుంచి 2022లో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు 12 సినిమాలకు దర్శకత్వం వహించిన రాజమౌళి అన్ని సినిమాలనూ సూపర్‌హిట్‌ చేయడం అనేది వెరీ రేర్ ఫీట్‌ అని చెప్పాలి. అయితే ఆ హీరోకీ తనతో సినిమాలు చేసిన ప్రతి హీరో ఆ తర్వాత చేసిన సినిమాలు ఫ్లాప్ అవడం అనేది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. 21 సంవత్సరాల్లో రాజమౌళి ఏడుగురు హీరోలతో సినిమాలు చేశారు. అయితే ఆ హీరోలందరూ రాజమౌళితో సినిమా చేసిన తర్వాత భారీ పరాజయాల్ని అందుకున్నారు. ఈ ఏడుగురు హీరోల్లో ఎన్టీఆర్‌, ప్రభాస్‌, రామ్‌చరణ్‌ మాత్రమే రాజమౌళితో మళ్లీ సినిమాలు చేశారు. ఒక దశలో రాజమౌళితో చేసిన సినిమా హిట్ అయిన తర్వాత మళ్లీ రాజమౌళి హిట్ ఇచ్చే వరకు ఎన్టీఆర్ వంటి హీరోకి హిట్ రాలేదంటే రాజమౌళి సినిమాల ప్రభావం ప్రేక్షకులపై ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజమౌళితో సినిమా చేయగానే ఆ హీరోలకు ఆ తర్వాత సినిమా డెఫినెట్‌గా ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్‌ ఉంది. అయితే దాన్ని ఎన్టీఆర్‌ దేవర చిత్రంతో బ్రేక్‌ చేశాడు. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత కొరటాల శివ కాంబినేషన్‌లో ఎన్టీఆర్ చేసిన దేవర ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు కలెక్ట్ చేసి అప్పటివరకు వున్న సెంటిమెంట్‌ని బ్రేక్‌ చేసింది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఇద్దరూ కలిసి ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నటించారు. తాజాగా రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో గేమ్‌ఛేంజర్‌ విడుదలైంది. ఈ సినిమా మొదటి షో నుంచే నెగెటివ్ టాక్‌ స్ప్రెడ్ అవుతోంది. కాబట్టి రాజమౌళి వల్ల మరోసారి రామ్‌చరణ్‌కి ఫ్లాప్‌ తప్పలేదనేది తేటతెల్లమైంది.

రాజమౌళి కెరీర్‌ని గుర్తించే.. మొదటి సినిమా స్టూడెంట్‌ నెం.1 నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు అతనితో సినిమా చేసిన హీరోలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎలాంటి అపజయాల్ని చవిచూశారు. ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందించిన మొదటి సినిమా స్టూడెంట్ నెం.1. ఈ సినిమా సూపర్‌హిట్ అయిన వెంటనే సుబ్బు సినిమా చేశారు ఎన్టీఆర్. ఇది ఒక డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత ఆదితో సంచలన విజయం సాధించారు. ఆ వెంటనే వచ్చిన అల్లరి రాముడు, నాగ చిత్రాలు డిజాస్టర్స్ కావడంతో ఎన్టీఆర్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. ఆ సమయంలోనే రాజమౌళితో సింహాద్రి చేశారు. ఈ సినిమా సంచలన విజయం సాధించి ఎన్టీఆర్‌ను హీరోగా ఎక్కడికో తీసుకెళ్లింది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ చేసిన ఆంధ్రావాలా పెద్ద డిజాస్టర్‌ అయింది. ఆ తర్వాత మరో 5 సినిమాలు చేసినా సాంబ ఒక్కటే కమర్షియల్‌గా ఓకే అనిపించింది. మళ్ళీ రాజమౌళితో యమదొంగ చేసేవరకు ఎన్టీఆర్‌కు మరో భారీ హిట్‌ పడలేదు. యమదొంగ చిత్రంతో మరో భారీ ఘనవిజయాన్ని అందుకున్నారు ఎన్టీఆర్. ఆ తర్వాత చేసిన సినిమాల్లో కొన్ని హిట్, కొన్ని ఫ్లాపులుగా నడిచాయి. అయితే అంతకుముందు రాజమౌళితో సినిమాల తర్వాత వచ్చిన డిజాస్టర్స్‌లా కాకుండా అప్‌ అండ్‌ డౌన్‌గా ఎన్టీఆర్‌ కెరీర్‌ సాగింది. మళ్ళీ ఆర్‌ఆర్‌ఆర్‌తో ఎన్టీఆర్‌ కెరీర్‌ గ్రాఫ్‌ ఒక్కసారిగా పుంజుకుంది. ఆ తర్వాత వచ్చిన దేవరతో దాన్ని నిలబెట్టుకొని ఫ్లాప్‌ల సెంటిమెంట్‌ నుంచి బయటపడ్డారు. రాజమౌళితో సినిమాలు చేసిన హీరోల్లో ఎన్టీఆర్ కెరీర్‌కే ఇన్ని అప్‌ అండ్ డౌన్స్‌లో ఉంది.

నితిన్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన సై అప్పట్లో ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత నితిన్ ఫ్లాప్‌ల పరంపర మొదలైంది. ఏకంగా 12 సినిమాలు వరసగా ఫ్లాప్ అవ్వడంతో అతని కెరీర్ అగమ్యగోచరంగా మారింది. ఆ సమయంలో ఇష్క్ వంటి సూపర్ హిట్‌తో నిలదొక్కుకోగలిగాడు. ప్రభాస్ విషయానికి వస్తే.. ఛత్రపతి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అతన్ని ఫ్లాపులు వెంటాడాయి. వరసగా ఆరు ఫ్లాప్‌లతో సతమతమయ్యాడు. మళ్ళీ డార్లింగ్ చిత్రంతో కోలుకున్నాడు. ఆ తర్వాత బాహుబలి సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో, కలెక్షన్లపరంగా రికార్డులు క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. అయితే ఆ సిరీస్ తర్వాత ప్రభాస్ చేసిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు.

ఇక నాని వంటి హీరోకి కూడా రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఫ్లాప్‌ల గొడవ తప్పలేదు. ఈగ వంటి సూపర్‌హిట్‌ తర్వాత నాకు వరసగా 6 ఫ్లాప్‌లు వచ్చాయి. మళ్లీ భలే భలే మగాడివోయ్‌ చిత్రంతోనే కమర్షియల్‌ హిట్‌ని అందుకోగలిగాడు. అప్పటివరకు కమెడియన్‌గా కొనసాగిన సునీల్‌ కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన తర్వాత మర్యాదరామన్న వంటి డీసెంట్‌ హిట్ సినిమా అతనికి దక్కింది. అయితే ఈ సినిమా సునీల్ కెరీర్‌కి ఏమాత్రం ఉపయోగపడలేదు. ఈ సినిమా అందించిన విజయం వల్ల అతని కెరీర్‌కి ఊపు రాలేదు. రామ్‌చరణ్‌ విషయానికి వస్తే.. రాజమౌళితో ఫస్ట్‌టైమ్‌ చేసిన మగధీర బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయి రామ్‌చరణ్‌ని స్టార్‌ హీరోని చేసింది. అయితే ఆ సినిమా తర్వాత చేసిన ఆరెంజ్‌ భారీ డిజాస్టర్‌ అయింది. ఈ సినిమా వల్ల నిర్మాత నాగబాబు తీవ్రంగా నష్టపోయారు. రాజమౌళితో చేసిన ఆర్‌ఆర్‌ఆర్‌ భారీ విజయాన్ని అందుకొని కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించింది. ఈ సినిమా తర్వాత ఇందులో హీరోలుగా నటించిన ఎన్టీఆర్, రామ్‌చరణ్ పరిస్థితి ఏమిటి అని అందరూ ఆందోళన చెందుతున్న సమయంలో దేవరతో రాజమౌళి సెంటిమెంట్‌ని ఎన్టీఆర్ బ్రేక్ చేసారు. గేమ్‌ఛేంజర్‌తో చరణ్‌ కూడా ఫ్లాప్‌ల సెంటిమెంట్‌ని బ్రేక్‌ చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. మరోసారి రాజమౌళి సినిమా తర్వాత రామ్‌చరణ్‌కి ఫ్లాప్‌ తప్పలేదు. దీన్నిబట్టి రాజమౌళితో సినిమా చేసిన హీరోకి ఆ తర్వాత చేస్తే సినిమా ఫ్లాప్ అవుతుంది అనే సెంటిమెంట్‌ని బ్రేక్‌ చేసిన హీరో ఎన్టీఆర్ ఒక్కరే అనేది కన్ఫర్మ్‌ అయింది.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech