- భూ భారతి తిరోగమన చట్టం ఉంది
- ధరణి వలనే తెలంగాణ భూముల రేట్లు పెరిగాయి
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ధరణి చట్టం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టం భవిష్యత్ లో భూ హారతిలా మారడం ఖాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం ఒక వ్యక్తిమీద కోపంతో తీసుకొచ్చినట్లు ఉందని, అలా కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా ఉంటే సంతోషిస్తామన్నారు. భూభారత చట్టం మొత్తం తిరోగమన చట్టం. భూ భారత చట్టం తెలంగాణలోని సుమారు 66 లక్షల మంది రైతులకు దుఃఖం తెప్పించేలా ఉందని ఆమె పేర్కొన్నారు.
ఈ మేరకు శనివారం జరిగిన శాసనమండలి సమావేశాల్లో భూ భారతిపై చర్చ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి చట్టంతో తెలంగాణలో మోసాలు కనుమరుగు అయ్యాయని అన్నారు. ధరణి వలనే తెలంగాణలో భూమి రేట్లు బాగా పెరిగాయని అన్నారు. భూ భారతి చట్టాన్ని కాదని ప్రజలు మళ్ళీ వెంటపడి మరీ ధరణి చట్టాన్ని సాధించుకుంటారని ఆమె జోస్యం చెప్పారు. ధరణి చట్టంలో కుట్రకోణం ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం దారుణమని అన్నారు. ధరణితో ఆటలాడుతోన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరన్నారు.
తెలంగాణలో 2.8 కోట్ల ఎకరాల భూమి ఉంది, అందులో 1.5 కోట్ల ఎకరాలు సాగు భూమి. 17. 8 లక్షల ఎకరాలు మాత్రమే వివాదాల్లో. గతంలో కౌలుదారులు కేసులు వేస్తే 20-25 ఏళ్ల పాటు రైతులు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేదని, కాబట్టి అందరూ ఆలోచించి కేసీఆర్ రైతుకు మాత్రమే భూమికి హక్కు ఉండే విధంగా చేశారన్నారు. ధరణి వల్ల అనేక భూ సమస్యలు పరిష్కారమయ్యాయని చెప్పారు. దాదాపు 35749 మంది ఉద్యోగులు 100 రోజుల్లో రికార్డులను ప్రక్షాళన చేశారని ఆమె గుర్తు చేశారు. భూ ప్రక్షాళన అనంతరం భూవివరాలను ధరణిలో ఎక్కించాం. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ధరణితో బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎమ్మెల్సీ కవిత చెప్పారు.
భూభాగాల వ్యవస్థను ప్రజల చేరువకు చేర్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది. నమోదు, మ్యూటేషన్ ఒకేసారి చేయడం వలన 42 నిమిషాల్లో పని పూర్తయ్యేదని అన్నారు. దాదాపు 66 లక్షల మంది రైతులకు బీఎస్ ప్రభుత్వం రైతుబంధు అందించింది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంలో మరోసారి 32 కాలమ్ లతో పహాణీలను రాయడం ప్రారంభిస్తే మళ్లీ పాత వ్యవస్థ వస్తుంది. దీంతో రైతుల మధ్య వివాదాలు తలెత్తాయి. హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములపై ప్రభుత్వం పెద్దల కన్ను పడిందని ప్రచారం జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. భూభారతి వల్ల తప్పు జరిగితే ప్రభుత్వ ఉద్యోగులకు శిక్ష వేస్తామని భయపెట్టడం సరికాదన్నారు. . భూభారతిలో కౌలుదారులు, అనుభవదారుల కాలం పెట్టే ఆలోచనను విరమించుకోవాలని, కౌలుదారులను వేరే విధంగా ఆదుకోవాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు.