ముద్ర,పానుగల్ :- పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని సాకారం నిరంతరం జిల్లా శ్రమించాలని వనపర్తి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రావుల గిరిధర్ అన్నారు. శుక్రవారం పానగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బాల సాహితీవేత్త గరిపెల్లి అశోక్ రాసిన “గోటిలాట” పుస్తకాన్ని ఆవిష్కరించారు.పిల్లలు తమ పాఠ్యపుస్తకాలతో పాటు సామాజిక అవగాహనను పెంపొందించే సాహిత్యాన్ని చదవాలని,వాటి ద్వారానే సంస్కారము,మానవ విలువలు అలవడతాయని సూచించారు.
నిత్యం ప్రకృతిని, సమాజాన్ని గమనించి తమవంతుగా చేయూతనందించేలా విద్యార్థులు తమ ప్రవర్తనను మలుచుకోవాలని అన్నారు.పిల్లలలో మానవతా విలువలను పెంపొందించేందుకోసం బాల సాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్న పాఠశాల ఉపాద్యాయుడు కిరణ్ కుమార్ కృషి ఎంతో అభినందనీయమన్నారు. ఏ లక్ష్యం ఏర్పరచుకోకుండా ముందుకెళ్లడం ఎలాంటి ఫలితాలు ఇవ్వదని, విద్యార్థుల పాఠశాల స్థాయి నుండే గొప్ప లక్ష్యాలను కలిగి ఉండాలని అన్నారు. గోటిలాట పుస్తకాన్ని రచించిన గరిపెల్లి అశోక్ కుమార్ ను అభినందించారు.”అవ్వ తాతలకు ఉత్తరాలు రాద్దాం రండి” అనే అంశంపై విజేతలైన పిల్లలకు ప్రశంసా పత్రాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వనపర్తి సిఐ కృష్ణ, పానగల్ ఎస్సై శ్రీనివాస్ యాదవ్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,విద్యార్థులు ఉన్నారు.