డిసెంబర్ 4న ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో పుష్ప2 ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె కుమారుడు 9 ఏళ్ళ శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సి.వి.ఆనంద్ ప్రభుత్వం కిమ్స్ హాస్పిటల్‌కి వెళ్లి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.
అనంతరం మీడియా సమావేశంలో సి.వి.ఆనంద్ మాట్లాడుతూ ‘డిసెంబర్ 4న సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించారు. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన రెండు వారాలవుతోంది. ఈరోజు ప్రభుత్వం కిమ్స్ హాస్పిటల్‌కి రావడం జరిగింది. హెల్త్ సెక్రటరీ క్రిస్టినాను శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నాం. వారు చెప్పిన దాని ప్రకారం తొక్కిసలాటలో శ్రీతేజ్ బ్రెయిన్ డ్యామేజ్ అయింది. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అతను రికవరీ అవ్వడానికి చాలా రోజులు పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఒక విధంగా ట్రీట్‌మెంట్‌ను సుదీర్ఘంగా సాగించాల్సిన అవసరం ఉంది. అతని ఆరోగ్య పరిస్థితిని తెలిపేందుకు ఆసుపత్రి వారు త్వరలోనే హెల్త్ బులెటిన్‌ను విడుదల చేస్తారు. శ్రీతేజ్ ట్రీట్‌మెంట్ గురించి మానిటర్ చేస్తున్నాము. అతని ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నాను. అతని చికిత్సకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని మేమంతా కోరుకుంటున్నాం’ అన్నారు.
శ్రీతేజ్ చికిత్స కోసం అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సి.వి.ఆనంద్ చెబుతున్నారు. మరోపక్క హాస్పిటల్‌కి సంబంధించిన ఖర్చు అల్లు అర్జునే చెల్లిస్తున్నారని అతని బృందం చెబుతోంది. శ్రీతేజ్‌ను హాస్పిటల్ చేర్పించిన నాటినుంచి అల్లు అర్జున్ టీమ్ ఇదే మాట చెబుతోంది. చికిత్సకు అవసరమైన ఖరీదైన ఇంజెక్షన్‌ని కూడా సింగపూర్ నుంచి తెప్పించామని ప్రకటించారు. తాజాగా సి.పి. సీవీ ఆనంద్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే శ్రీతేజ్ చికిత్సకు ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తోందని తెలుస్తోంది. మరి ఇందులో ఏది నిజం? ఇప్పటివరకు అల్లు అర్జున్ టీమ్ చెబుతున్నదంతా అబద్ధమా? ఈ విషయంలో స్పష్టత రావాల్సిన అవసరం ఉంది.