శనివారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీస్‌కి వచ్చారు. అక్కడ కొంతసేపు ఉన్న తర్వాత తన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ఆ సమయంలో అక్కడ కొంత ఎమోషనల్ వాతావరణం చోటు చేసుకుంది. ఆ తర్వాత టాలీవుడ్‌కి చెందిన ప్రముఖులు చాలా మంది అల్లు అర్జున్‌ని కలిశారు. ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశంలో అల్లు అర్జున్ తన అరెస్ట్ గురించి కాకుండా ఇంకా ఎన్నో అంశాల గురించి ప్రస్తావిస్తారని అందరూ ఆశించారు. అయితే ఈ ప్రెస్‌మీట్‌లో కొత్త విషయాలేవీ బన్నీ మాట్లాడలేదు. అసలు ఈ సమావేశంలో ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం.
‘అందరికీ నమస్కారం. నన్ను సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. జరిగిన ఘటన చాలా దురదృష్టకరం. నేను సారీ చెబుతున్నాను. నేను థియేటర్‌లో ఫ్యామిలీతో సినిమా చూస్తున్నాను. బయట ఈ ఘటన జరిగింది. దానికి, నాకు ఎలాంటి కనెక్షన్ లేదు. నేను దాదాపు 20 సంవత్సరాలుగా ఆ థియేటర్‌కి వెళ్తున్నాను. ఇప్పటికి 30 సార్లు వెళ్లి ఉంటాను. కానీ, ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదు. ఇది పూర్తిగా దురదృష్టకర ప్రమాదం. నేను ఆ ఫ్యామిలీకి ఒక్కటే చెప్పదలుచుకున్నాను. వారికి నేను అండగా ఉంటాను. మా పరిధి మేరకు వారికి ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తాను. అలాగే ఆ ఫ్యామిలీని కూడా త్వరలోనే కలుస్తాను’ అంటూ క్లుప్తంగా ప్రెస్‌మీట్‌ను ముగించారు అల్లు అర్జున్. మీడియా మాత్రం రకరకాల ప్రశ్నలు అడిగింది. కానీ, వాట నటీనటులు బన్నీ దాటిపోయారు. కొన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్పలేనని, కోర్టులో కేసు ఉంది కాబట్టి తాను కామెంట్స్ చేయడం సరి కాదని త్రోసిపుచ్చారు.