- 150 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడికి అవకాశం
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో : వరి దిగుబడిలో తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టిస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దాదాపు 150 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడికి అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. 60.80 లక్షల ఎకరాల్లో ప్రభుత్వం అంచనా వేస్తున్న దిగుబడిలో 91 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కోసం ఆస్కారం ఉంది. అందులో 47 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలుగా, 44 లక్షలు దొడ్డు రకం ఉంటాయి. ఖరీఫ్ నుండి సన్నాలకు బోనస్ గా క్వింటా ఒక్కింటికి 500 రూపాయలు ప్రకటించిన నేపద్యంలో రైతులు సన్నాల వైపు మొగ్గు చూపారు. ఈ మొత్తం కొనుగోలుకు గాను రూ. 30 వేల కోట్లు అవుతాయి. ప్రభుత్వం ఇప్పటికే రూ. 20 వేల కోట్లు విడుదల చేసిందని ఆయన చెప్పారు. పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు అదనంగా నిధులు విడుదల చేయడానికి సిద్దంగా ఉన్నామని ఆయన చెప్పారు.
ధాన్యంకొనుగోలు విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ మేరకు మంగళవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సహచర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లతో పాటు లోక్ సభ, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అత్యధికంగా రికార్డ్ స్థాయిలో పంట దిగుబడి అయిన నేపధ్యంలో ధాన్యంకొనుగోలు అనేది ప్రభుత్వానికి పరీక్షా కాలమని, ఇందులో ప్రజాప్రతినిధులు విధిగా భాగస్వామ్యం అవ్వాలని ఆయన పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు ఏమరు పాటు వ్యవహరించి ఎక్కడికక్కడ ధాన్యంకొనుగోళ్లు పకడ్బందీగా జరిగేలా చూడాలన్నారు. ప్రభుత్వానికి ఎక్కడ కూడా అప్రదిష్ట రాకుండా చూడాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లో 7572 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. తెలంగాణా బియ్యానికి బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో డిమాండ్ డిమాండ్. రెండుమూడు బయటి దేశాలు కూడా తెలంగాణా బియ్యాన్ని దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ధాన్యం కొనుగోలు లేకుండా తాలు, తరుగుదల కొనుగోలు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు మేరకే కొనుగోళ్లు జరుగుతున్నాయని ,తేమ శాతంలో రైతులకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.