- ఇటు బీఆర్ఎస్లో మేకపోతు గాంభీర్యం
- అరెస్ట్‌లపై ఉప్పందించిన కేటీఆర్
- పార్టీ నేతలకు భరోసా నింపే ప్రయత్నం
- త్వరలో అరెస్టులు తప్పవనే హెచ్చరికలు
- ఇప్పటికే రాష్ట్రంలో భద్రత పెంచిన ప్రభుత్వం
- ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ఆంక్షలు
- గ్రామస్థాయి నుంచి రోజువారీగా ఇటలీజెన్సీ నివేదికలు
ముద్ర, తెలంగాణ బ్యూరో :-రాష్ట్రంలో ఉన్న పలంగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన ప్రాంతాలు, కూడళ్ల వద్ద పోలీసుల భద్రతను భారీగా పెంచారు. ఒక్కసారిగా పోలీసులు భద్రతను ఎందుకు పెంచారనే అంశం ప్రస్తుతం ప్రజల్లో రకరకాల ఊహాగానాలకు తెరతీస్తోంది. ఇది దేనికి సంకేతమన్న అంశం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిన విధంగా దీపావళికి ముందు బీఆర్ఎస్ నేతలను ఎవరినైనా అరెస్టు చేస్తారా? అనే దానిపై వాడివేడి చర్చ జరుగుతోంది. పలు కేసులను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తొవ్వి తీసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో ఉండగా కొందురు నేతలు…పెద్దఎత్తున అవినీతి,అక్రమాలకు పాల్పడినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారాలతో సహా వివరాలు సేకరించింది. వీటి ఆధారంగా అరెస్టులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.
పరిశీలన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సైతం…. `కాంగ్రెస్ ప్రభుత్వం మనపై కేటీఆర్ దాడులు, అరెస్టులు చేసే అవకాశం ఉంది…..కేసులు పెడతారు….రకరకాలుగా వేధిస్తారు. అన్నింటిని తట్టుకుని నిలుచుందాం…కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేద్దాం’ అంటూ పార్టీ కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా….ఎన్ని కష్టాలు వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేస్తున్నారు. దీంతో త్వరలోనే బీఆర్ఎస్ కు చెందిన ముఖ్యనేతలను అరెస్టు చేసే అవకాశం ఉందా…అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అదే సమయంలో బీఆర్ఎస్ నేతలు సైతం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వానివి కేవలం ఉత్తుత్తి గాండ్రింపులేనని వ్యాఖ్యానిస్తున్నారు. కానీ కేటీఆర్ మాత్రం ఇప్పటికే అరెస్టుల వ్వవహారంపై పార్టీ నేతలకు అంతర్గతంగా ఉప్పందించినట్లుగా సమాచారం. అయినప్పటికీ పార్టీ నేతల్లో భరోసా కల్పించే ప్రయత్నం కేటీఆర్ చేస్తూనే ఉన్నారు.
కాగా అరెస్టు సందర్భంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం పెద్దఎత్తున భద్రతను పెంచినట్లుగా చూపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఇప్పటికే భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే మంత్రుల ఇళ్ళు, సచివాలయం, గాంధీభవన్ తో పాటు ముఖ్యమైన కూడళ్ళ వద్ద పోలీసులు గస్తీని పెంచారు. ఇక ప్రభుత్వ కార్యాలయాల వద్ద మరిన్ని ఆంక్షలను పెంచినట్లుగా తెలుస్తోంది. కార్యాలయాల్లోకి కొత్తగా వచ్చే వారిని విచారించిన తరువాతనే లోనికి అనుమతిస్తున్నారని. కాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రామ స్థాయి నుంచి రోజువారిగా ఇంటిలిజెన్సీ నివేదికలను తెప్పించుకుంటుంది. జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై వచ్చిన నివేదికలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. అరెస్టులపై ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత ఉండదన్న నిర్ణయానికి వచ్చిన వెంటనే గులాబీ ముఖ్యనేతలను అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది. మొత్తం మీద దీపావళి బాంబులు….ఎటునుంటి ఎటుపోతుందోనన్న అంశం ప్రస్తుతం రాజకీయవర్గాల్లో సైతం వాడివేడి చర్చ సాగుతోంది. మరి నిజంగానే బాంబుల్లా పేలుతాయా…. తుస్తుమంటుందా అన్నది ఒకటి, రెండు తేలనుందని తెలుస్తోంది.