ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో బెటాలియన్ పోలీసుల నిరసనలు హోరెత్తుతున్నాయి. పోలీసులు వర్సెస్ పోలీసులగా పరిస్థితి మారిపోయింది. ఖాకీ చొక్కాలతో రోడ్డెక్కారు. కుటుంబ సభ్యులతో సహా నిరసనలకు దిగుతున్నారు.ఈ నేపథ్యంలోనే సీఎం సెక్యురిటీ వీ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం సెక్యురిటీలో మార్పులు చేసింది. సీఎం రేవంత్ నివాసం దగ్గర బెటాలియన్ పోలీసు సిబ్బందిని సెక్యురిటీల వింగ్ తొలగించింది. ఇప్పటి వరకు తెలంగాణ స్పెషల్ పోలీస్ సిబ్బంది సీఎం ఇంటి దగ్గర భద్రత కల్పించేందుకు సోమవారం నుంచి ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులను నియమించారు.
సమస్యలను పరిష్కరించాలంటూ టీజీఎస్పీ పోలీసులు కుటుంబసభ్యులతో కలిసి పెద్దఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. దీనితో నిరసనలు చేస్తూ నిబంధలకు విరుద్ధంగా వ్యవహరించారు క్రమశిక్షణా చర్యల పేరుతో 39 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను శనివారం నాడు పోలీస్ సిబ్బంది సస్పెండ్ చేశారు. ఆదివారం నాడు ఏఆర్‌ఎస్సై, మరో హెడ్ కానిస్టేబుల్ సహా ఏకంగా 10 మందిని ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయినప్పటికీ వీరి ఆందోళనలు మాత్రం ఆగడం లేదు. తమకు వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించాలని బెటాలియన్ పోలీసులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.