- రైతులకు తక్షణమే రైతు భరోసా ఇవ్వాలి
- ఎన్నికల్లో హామీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందజేయాలి
తుంగతుర్తి ముద్ర:- రైతు భరోసా కోసం రైతుల పక్షాన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో నిరసన కార్యక్రమం చేపట్టారు.ఇందులో భాగంగా ఆదివారం తుంగతుర్తి మండల కేంద్రం తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య ఆధ్వర్యంలో తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ సూచన మేరకు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తాటికొండ సీతయ్య మాట్లాడుతూ…ఎకరానికి రూ. 15 వేలు రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయలేదని కాంగ్రెస్ తీరును ఎండగట్టారు.వానాకాలం పంట సీజన్‌లో రైతులకు ఇవ్వాల్సిన రైతుబంధు ప్రభుత్వం ఎగ్గొట్టిందనీ, వానాకాలం పంట సీజన్‌కు రైతు భరోసా ఇవ్వలేమని మంత్రి చెప్పడం మోసం చేయడమేనని అన్నారు. వెంటనే క్షమాపణ చెప్పి రైతులకు రైతు భరోసా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే రైతు బంధు ఇవ్వరని మాజీ సీఎం కేసీఆర్ ముందే చెప్పారు.
ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నిజం చేశారన్నారు. రైతు బంధును పూర్తిగా ఎగ్గొట్టి లక్షలాది మంది రైతుల నోట్లో మట్టి కొట్టి ఉన్నారు. ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తామంటే ఊరుకునేది. రైతులకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని, రుణమాఫీ చేసే వరకు, రైతు భరోసా ఇచ్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలేది లేదని బీఆర్‌ఎస్ శ్రేణులు సూచిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆడబిడ్డలకు లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్న ప్రభుత్వం… నేటికి దానిని ఇవ్వలేక చతికిల పడుతోంది. రేవంత్ రెడ్డి ఇచ్చిన ఏ ఒక్క గ్యారెంటీ కూడా కాంగ్రెస్ అమలు చేయలేక పోయిందని ఎద్దేవా చేశారు. అమలు చేయలేని హామీలతో అధికారంలోకి వచ్చిన 10 నెలలుగా మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు.ఈ నిరసన కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు గాజుల యాదగిరి, మల్లెపాక రాములు, కొండగడుపుల నాగయ్య, చింతకుంట్ల మనోజ్, వెంకటేష్, యువత గోపగాని శ్రీను, ఉప్పలయ్య, దశరథ , గుడిపాటి వీరయ్య, బొంకురి మల్లేష్, సాయి కిరణ్, యాకు నాయక్, మోహన్ లాల్, మధు,తదితర బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.