ముద్ర, తెలంగాణ బ్యూరో : పదేండ్లపాటు రాష్ట్రాన్ని ఆగం చేశారు, కులవృత్తులకు తీరని అన్యాయం చేశారు ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అన్నారు. చేపల పంపిణీ పేరుతో నిధులు కాజేశారని, ముదిరాజ్ లకు, బెస్తలకు పంచాయతీ పెట్టి పబ్బం గడుపుకున్నారని ఆరోపించారు. గురువారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలో అప్పటి మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, హరీష్‌రావు కలిసి ఫిషరీస్ డిపార్ట్‌మెంట్‌లో కోట్లు కొట్టేశారు. ఫిషరీస్ డిపార్ట్‌మెంట్‌లో విచారణపై విచారణ జరుగుతుందని, హరీష్ రావు, తలసాని అనుచరులు గత పదేళ్ల లోచేప పిల్లలు కాజేశారన్నారు. సిద్దిపేటలోని మల్లన్న సాగర్ లో హరీష్ రావు ఎన్ని చేపలు వేశారో చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు.
ఈ చర్చ గంగమ్మ పెద్దమ్మ గుడిలో పెడదామా.. సిద్దిపేట కాలేజీలో పెడదామా తేల్చుకోవాలన్నారు. రాష్ట్రంలో ఈ కాంట్రాక్టర్లను పెంచి పోషించింది హరీష్ రావు అని, చెరువుల్లో వాతావరణ పరిస్థితులకు సంబంధం లేకుండా గత పదేళ్లుగా చేపలు వేశారని, దీంతో చాలా నష్టం జరిగిందని సాయి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రొయ్యపిల్లల పంపిణీలోను అప్పుడు తలసాని, హరీశ్‌రావు ఇద్దరూ దోచేశారని, ఈ ఇద్దరు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. తమపై నిరాధారమైన ఆరోపణలు చేసిన హరీష్ రావు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో చేప పిల్లల పంపిణీ చేస్తామని, నాణ్యమైన పిల్లలను సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకున్నామని, నవరాత్రుల నుంచి చేప పిల్లల పంపిణీని ప్రారంభించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చెరువులలో చేప పిల్లల పంపిణీ జరుగుతుందని, ఈసారి తాము ప్రతీ చెరువు వాతావరణాన్ని బట్టి, ప్రతి చెరువులో ఒక్కో రకమైన నాణ్యమైన చేపపిల్లలు వేస్తున్నామన్నారు. మత్స్యకారుల కుటుంబాలలో చనిపోయిన 571 మందికి ఎక్స్ గ్రేషోయా ఇస్తామని సీఎం చెప్పారు.