- ఆందోళనకు దిగిన స్థానికులు
- మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు – కిషన్ రెడ్డి
- శాంతిభద్రతలు దిగజారుతోన్నాయి – కేటీఆర్
ముద్ర, తెలంగాణ బ్యూరో : సికింద్రాబాద్ మెండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఆదివారం అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడిన దుండగులు విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు సహా హిందువుల సంఘాలకు చెందిన కార్యకర్తలు ఆలయం వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. నిందితులను తక్షణం పట్టుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను నిలదీసే ప్రయత్నం చేశారు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇదిలావుండగా ఘటన స్థలానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ చేరుకుని స్థానికులతో మాట్లాడారు. అలాగే విగ్రహం ధ్వంసం ఘటనను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విగ్రహం ధ్వంసంపై గోషామహాల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క రాజకీయనాయకుడిని ఘటన స్థలానికి వెళ్ళనిస్తున్నారని, అయితే తనను మాత్రం ఎందుకు గృహనిర్భందం చేస్తున్నారో అర్ధం కావడం లేదు.
మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం – కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్ లో మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. అందులో భాగంగానే కుమ్మరిగూడ ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. నాంపల్లి ఘటన మరవకముందే తాజాగా సికింద్రాబాద్ ఘటన జరిగింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో దుర్గామాత మండపంలోని దుండగులు దొంగతనానికి రాలేదని, విగ్రహాన్ని ధ్వంసం చేయడానికే వచ్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విగ్రహాల ధ్వంసం అవసరం.. ఇటువంటి ఘటనలపై ప్రభుత్వం వ్యవహరించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో హిందూ దేవాలయాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వద్ద రాత్రి సమయంలో పోలీస్ పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా.. ప్రభుత్వం, పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ నగరంలో డీజేలపై నిషేధం విధించిన పోలీసులు.. దేవాలయాల పరిరక్షణపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం ఘటనను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
అమ్మవారి ఆలయంపై దాడి తెలివి తక్కువ చర్య – మాజీమంత్రి కేటీఆర్
సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయంపై దాడి తీవ్ర కలకలం రేపుతోందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలివితక్కువ చర్యలు మన హైదరాబాద్ నగరం యొక్క సహనశీలతకు మచ్చని అన్నారు. దుండగులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గత నెలరోజులుగా శాంతిభద్రతలు దిగజారుతోన్నాయని, దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కేటీఆర్ అన్నారు.