కొందరు ప్రముఖులు ఎప్పుడూ వార్తల్లో ఉండాలని కోరుకుంటారు. వారు ఉన్న రంగంలో పేరు తెచ్చుకోవడం ద్వారా, వివాదస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా అందరికీ చర్చనీయాంశంగా మారతారు. అలాంటి వారిలో ప్రముఖంగా వినిపించే పేరు రామ్‌గోపాల్‌వర్మ. ఒకప్పుడు తన సినిమాలతో ఫేమస్ అయిన వర్మ ఇప్పుడు తన ట్వీట్లతో, వివాదస్పద వ్యాఖ్యలతో మరింత ఫేమస్ అవ్వాలని చూస్తున్నారు. ఎక్కడ ఏది జరిగినా నేనున్నాంటూ తన ట్వీట్లతో విరుచుకుపడుతుంటారు. ఆ ఘటనతో తనకు సంబంధం ఉందా లేదా అనేది పక్కన పెట్టి ఏదో ఒక కామెంట్ చేయడం వల్ల నెటిజన్లకు పని ఎక్కువైపోతోంది. తాజాగా అలాంటి వివాదస్పద ట్వీట్లతో సోషల్ మీడియాలో హలచల్ చేస్తున్నారు రామ్గోపాల్ వర్మ. అసలు ఆ ట్వీట్స్ ఏమిటో ఒకసారి చూద్దాం.
‘1998లో కృష్ణజింక చంపబడినప్పుడు లారెన్స్ బిష్ణోయ్ వయసు కేవలం 5 సంవత్సరాలు. బిష్ణోయ్ తన పగను 25 సంవత్సరాలు కొనసాగింది. ఇప్పుడు 30 ఏళ్ల వయసులో కూడా జింకను చంపిన ప్రతీకారంగా సల్మాన్‌ని చంపడమే తన జీవిత లక్ష్యం అంటున్నాడు. జంతు ప్రేమ అంత ఉచ్ఛస్థితిలోకి వెళ్ళిపోయిందా.. లేక విచిత్రమైన జోక్స్‌తో దేవుడు ఆడుకుంటున్నాడా?’ అంటూ లారెన్స్ బిష్ణోయ్ గురించి వెటకారంగా ట్వీట్ చేశారు.
కృష్ణజింకను సల్మాన్ చంపడం, దానికి బిష్ణోయ్ ప్రతీకారం తీర్చుకోవడం అనే అంశాన్నే తీసుకొని కథగా చేస్తే ఏమవుతుంది అంటూ మరో ట్వీట్ చేశారు. వర్మ చెప్పిన ఆ స్టోరీ విలువ.. ‘గ్యాంగ్‌స్టర్‌గా మారిన ఒక న్యాయవాది.. ఒక సూపర్‌స్టార్‌పై పగ పెంచుకుంటాడు. అది కూడా తన చిన్నతనంలో జింకను చంపిన అతన్ని చంపాలని తన గ్యాంగ్‌లోని 700 మందిని ఆజ్ఞాపిస్తాడు. మొదట ఆ స్టార్‌కి సన్నిహితుడైన ఒక పెద్ద రాజకీయవేత్తను చంపమని ఫేస్‌బుక్ ద్వారా ఒకరిని రిక్రూట్ చేసుకుంటాడు. గ్యాంగ్‌స్టర్‌గా మారిన ఆ న్యాయవాది జైలులో ప్రభుత్వ రక్షణలో ఉన్నందున మరియు అతని ప్రతినిధి విదేశాల నుండి మాట్లాడుతున్నందున పోలీసులు అతన్ని పట్టుకోలేరు. ఒక బాలీవుడ్ రచయిత ఇలాంటి కథతో వస్తే నమ్మశక్యం కానీ, హాస్యాస్పదమైన ఇలాంటి కథ రాసినందుకు అతన్ని కొట్టేస్తారు.
ఇలా రెండు భిన్నమైన ట్వీట్స్ తో ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాడు వర్మ. సల్మాన్‌ఖాన్‌కి, లారెన్స్ బిష్ణోయ్‌కి ఉన్న శత్రుత్వం ఏమిటి? అసలు ఎవరీ లారెన్స్ బిష్ణోయ్ అనే వివరాల్లోకి వెళితే.. బిష్ణోయ్ కమ్యూనిటీకి చెందిన లారెన్స్ బిష్ణోయ్ 1993 ఫిబ్రవరి 12న జన్మించాడు. అతని స్వస్థలం పంజాబ్ ఫిరోజ్‌పూర్‌లోని తాజాగా ధత్తరన్‌వాలి గ్రామం. రాజస్థాన్ సరిహద్దులోని అబోహర్ అనే చిన్న పట్టణంలోని పాఠశాలలో చదువుకున్నాడు. అనంతరం పైచదువుల కోసం 2010లో చండీగఢ్‌కు వెళ్లి డీఏవీ కాలేజీలో చేరాడు. అక్కడే అతని నేర సామ్రాజ్యానికి తొలి అడుగు పడింది. డీఏవీ కళాశాలలో చేరిన తరువాత బిష్ణోయ్ విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2011-12 మధ్య పంజాబ్ విశ్వవిద్యాలయం విద్యార్థి సంస్థ అధ్యక్షుడయ్యాడు. అక్కడే అతనికి గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌తో పరిచయం ఏర్పడింది. అతని అండదండలతో అనతికాలంలోనే యూనివర్శిటీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఆ సమయంలోనే అనేక నేర కార్యకలాపాలకు పాల్పడ్డాడు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన దారుణమైన విషయం తెలిసిందే. ఈ హత్యకు తాము బాధ్యత వహిస్తున్నట్లు.. కరడుగట్టిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించారు. దీంతో మరోసారి బిష్ణోయ్ అంశం తెరపైకి వచ్చింది. బిష్ణోయ్ నేర సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడో ఇప్పుడు తెలుసుకుందాం. మోకా చట్టంలో అరెస్టయిన బిష్ణోయ్ ప్రస్తుతం తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. బిష్ణోయ్ నేర సామ్రాజ్యం దేశమంతా విస్తరించింది. ఈ గ్యాంగ్‌లో ఏకంగా 700 మంది సభ్యులు ఉన్నారు. ఖలిస్తాన్ ఉద్యమంతో పాటు దేశ వ్యతిరేక కార్యకలాపాలను బిష్ణోయ్ తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తానని బిష్ణోయ్ బహిరంగంగానే ప్రకటన చేశాడు. కృష్ణ జింకను చంపిన దృశ్యాలు బెదిరింపులకు దిగాడు. దీంతో సల్మాన్‌కి ప్రభుత్వం వై ప్లస్ భద్రత కల్పించింది. ఇప్పుడు వర్మ చేసిన మొదటి ట్వీట్‌లో కేవలం 5 సంవత్సరాల వయసులో ఉన్న బిష్ణోయ్.. కృష్ణజింకను చంపినందుకే సల్మాన్‌ఖాన్‌పై పగను పెంచుకొని 25 సంవత్సరాలుగా అతనిని చంపేందుకు ప్రయత్నించడం హాస్యాస్పదంగా ఉందంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. అలాగే బిష్ణోయ్ కథను అనేక మలుపులతో కథగా తీస్తే జనంలో ఎంత వ్యతిరేకత వస్తుంది అనేది రెండో ట్వీట్‌లో వివరించింది.