తెలుగులో పలు ఇతర దక్షిణాది భాషల్లో విలన్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు మోహన్ రాజ్ కన్నుమూశారు. మోహన్ రాజ్ తిరువనంతపురంలోని తన నివాసంలో గురువారం నాడు తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్ల కిందట ఓ తెలుగు చిత్రంలో యాక్షన్ సన్నివేశంలో నటిస్తుండగా కాలికి గాయమైంది. ఆ గాయం ఆయన కెరీర్ ను దెబ్బతీసింది. ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేకపోయారు. ఆరడుగుల ఎత్తుతో బలంగా కనిపించే మోహన్ రాజ్ విలనిజం పండించడంలో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారు.
మోహన్ రాజ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. 1989లో వచ్చిన ‘కిరీడమ్’ చిత్రంతో ఆయన ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన పనిలేకుండా పోయింది. మలయాళ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ చిత్రం మలయాళ సినీ చరిత్రలోనే గొప్ప హిట్ చిత్రంగా నిలిచిపోయింది. ఆ సినిమా ఇచ్చిన బ్రేక్ తో మోహన్ రాజ్ కు పెద్ద సంఖ్యలో అవకాశాలు వచ్చాయి. ఆయన తన కెరీర్‌లో 300కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగులోనూ ఆయన అనేక చిత్రాల్లో నటించారు. 90వ దశకంలో వచ్చిన తెలుగు చిత్రాల్లో అగ్రహీరోల సినిమాల్లో మోహన్ రాజ్ విలన్ పాత్రలు పోషించారు. బాలకృష్ణ, మోహన్ బాబు, రాజశేఖర్ వంటి హీరోలకు ప్రతినాయకుడిగా మెప్పించారు. రెండేళ్ల కిందట మమ్ముట్టి ప్రధాన పాత్రలో వచ్చిన ‘రోర్షాచ్’ అనే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో మోహన్ రాజ్ చివరిసారిగా నటించారు. ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఇంటికే పరిమితం అయ్యారు. ఆయన అంత్యక్రియలు రేపు తిరువనంతపురంలో నిర్వహించనున్నారు.