రంగురంగుల పూలను శిఖరంగా పేర్చి ఆ పైన గౌరమ్మను ఉంచి.. మహిళలంతా కలిసి ఆనందంగా చేసుకునే పండుగే బతుకమ్మ. నేటి నుంచి మహిళలు రోజుకో విధమైన బతుకమ్మలను పేర్చి చెరువుల్లో నిమజ్జనం చేస్తున్నారు. బుధవారం అమావాస్య కావడంతో ఎంగిలి పూల బతుకమ్మను పేర్చనున్నారు. మరుసటి రోజు నుంచి అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నెముద్దల బతుకమ్మ చివరగా సద్దుల బతుకమ్మతో సంబరాలు ముగుస్తాయి.
బతుకమ్మ పండుగ విశిష్టత
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే గొప్ప పండుగ బతుకమ్మ. ఏ పండుగకు కలవకున్నా ఈ పండుగకు మాత్రం ఆడపడుచులంతా కలుసుకుంటారు. బతుకమ్మ పండుగ వస్తోందంటే ప్రకృతి అంతా పూలవనంగా మారిపోతుంది. చెరువులు, కుంటలు, జలాశయాలు నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. తెలంగాణలో పండుగల్లో పాట నేర్పింది బతుకమ్మనే. పువ్వులతో బతుకమ్మను పేర్చి పువ్వుల నడుమ పుప్పొడిని, పసుపు ముద్దను అలంకరిస్తారు. ఈ పండుగ జరుగుతున్న రోజులూ పల్లెలు, పట్టణాలు పూలవనాలయిపోతాయి.