- సీఎం రేవంత్, మాజీ కేసీఆర్ సంతాపం
ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు డాక్టర్ బొజ్జా విజయభారతి కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ శుక్రవారం నాడు తీవ్ర అస్వస్థతకు విజయభారతి గురికావడంతో సనత్ నగర్లోని రెనోవా ఆసుపత్రిలో ఆమె కుటుంబ సభ్యులు చేర్చారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో చికిత్స పొందుతూ శనివారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె భౌతికకాయాన్ని గాంధీ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థుల పరిశోధన కోసం డొనెట్ అనే కుటుంబ సభ్యులు ప్రకటించారు. విజయభారతి మృతి పట్ల పలువురు రచయితలు, మేధావులు, నాయకులు సంతాపం ప్రకటించారు. దళిత సాహిత్యానికి తీరనిలోటు అని పేర్కొన్నారు. బొజ్జా విజయభారతి ప్రముఖ కవి దివంగత డాక్టర్ బోయి భీమన్న పెద్ద కుమార్తె. న్యాయవాది, మానవ హక్కుల నేత దివంగత బొజ్జా తారకం సహచరిణి. రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జ మాతృమూర్తి. ఉమ్మడి ఏపీలో తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ గా విజయభారతి సేవలందించారు. ప్రాచీన సాహిత్య కోశం, ఆధునిక సాహిత్య కోశం వెలువరించారు. సాహిత్య, సామాజిక అధ్యాయనశీలిగా ఆమె అనేక రచనలు చేశారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచనలు, ప్రసంగాల సంపుటాలకు సంపాదకురాలిగా వ్యవహరించారు. మహాత్మ జ్యోతిరావు ఫూలే జీవిత చరిత్రను తెలుగు సమాజానికి మొట్టమొదటిసారి అందించిన రచయిత్రిగా గుర్తింపు పొందారు. భారతీయ కుల వ్యవస్థ, స్వరూప స్వభావాల గురించి పుణాలు, ఇతిహాసాల ఆధారంగా విశ్లేషణలు చేస్తూ విజయభారతి పలు రచనలు చేశారు. అలాగే పురాణాల్లో దళిత స్త్రీ పాత్రల గురించి అనేక రచనలు చేశారు. ఆమె వ్యాస సంకలనం ” 75 ఏళ్ళ స్వాతంత్ర్య భారతం స్త్రీలకు గుప్పెడు ధూళినే మిలిల్చిందా? ” అనే శీర్షిక విడుదలైంది. అలాగే తన ఆత్మకథను కూడా రాతప్రతిగా ఆమె సిద్ధం చేశారు. ఇది ప్రచురణ కావాల్సివుంది. ఆమె రచనలన్నింటినీ హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. అలాగే విజయభారతి మరణం పట్ల మాజీ సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు విజయభారతి చేసిన కృషిని కేసీఆర్ స్మరించారు.