- కిక్కిరిసిన ట్యాంక్ బండ్, పరిసర ప్రాంతాలు
- క్రేన్ 4 దగ్గర ఖైరతాబాద్.. 13 దగ్గర బాలాపూర్ గణేశుడి నిమజ్జనం
- జీహెచ్‌సి పరిధిలో 71 కృత్రిమ నీటి కొలనుల ఏర్పాటు
- వేలం పాటలో రికార్డులు బ్రేక్ చేసిన లడ్డులు
- కొనసాగుతున్న నిమజ్జనాలు, పోలీసులతో భారీ భద్రత
- నేడు ఉదయం వరకు నిమజ్జనం ప్రక్రియ పూర్తి
- హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సీఎం రేవంత్
ముద్ర, తెలంగాణ బ్యూరో :పార్వతీ పుత్రుని చవితి వేడుకలు.. రాష్ట్ర రాజధానిలో అంబరాన్నంటాయి. కాషాయ పగిడీలు,టోపీలు,కండువాలు ధరించి లక్షలాదిగా విచ్చిన భక్తుల నడుమ గణనాథుల ఊరేగింపు శోభయమానంగా సాగింది. అశేషంగా విచ్చేసిన భక్తులు బై బై గణేశా..! అంటూ గణపయ్యకు వీడ్కోలు పలికారు. దీనితో భాగ్యనగరమంతా కాషాయమయమైంది. నగరంలో నవరాత్రులు పూజలందుకున్న విఘ్నేశ్వరుడి విగ్రహాల నిమజ్జన వేడుకలు మంగళవారం ఉదయం ప్రారంభం కాగానే నేడు ఉదయం వరకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పాల్గొన్నారు. సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమిచ్చిన ఖైరతాబాద్ లంబోదురుడు 11 రోజుల పూజల అనంతరం మంగళవారం రాత్రి నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం ఉదయం ఆరు గంటలకే బయలుదేరిన ఆ 70 అడుగుల ఎత్తైన గణేష్ విగ్రహా నిమజ్జనం ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన నాల్గో క్రేన్ వద్ద మద్యాహ్నం 1.40 గంటలకు ముగిసింది.
మరో ప్రసిద్ధ బాలా గణేశుడి నిమజ్జం 13వ నెంబర్ క్రేన్‌వద్ద సాయంత్రం 6గంటల ప్రాంతంలోపూర్ ముగిసింది.బడ గణేశుల నిమజ్జన పర్వం ముగియడంతో సుమారు లక్షకు పైగా గణేష్ విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. నగరంతో పాటు శివారు ప్రాంతాలను హుస్సేన్ సాగర్,సరూర్ నగర్,రాంపూర్,సఫిల్ గూడ,కాప్రా సహా వంద చెరువుల్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వీటిలో ప్రధానంగా సాగర్, సరూర్ నగర్ చెరువుల్లో ఎక్కువ సంఖ్యలో వినాయక విగ్రహాలు నిమజ్జనమవుతున్నాయి. మంగళవారం రాత్రి వరకు ట్యాంక్ బండ్ పై 40 వేలకు పైగా విగ్రహాలు గంగమ్మ ఒడిలో సేదతీరాయి. హుస్సేన్ సాగర్ చుట్టూ 32 భారీ క్రేన్లు అందుబాటులో ఉంచారు. విగ్రహాల ఊరేగింపులో ఇబ్బందులు కలగకుండా.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు రాత్రి వరకు నగరంలో లారీలకు అనుమతి ఇవ్వలేదు. మరోవైపు నిమజ్జన వేడుకలను తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెడికల్ క్యాంపులు, డీఆర్డీఎఫ్ సిబ్బంది, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.
గంగమ్మ ఒడికి మహాగణపతి..!
తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ మహాశక్తి గణపతి నిమజ్జనం ఆద్యంతం భక్తజనుల సందడి మధ్య ఘనంగా ముగిసింది. 11 రోజుల పాటు భక్తుల నీరాజనాలు అందుకున్న భారీ గణేశుడు, గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. 70 అడుగుల ఎత్తులో భారీ కాయుడై, ప్రపంచ రికార్డు సృష్టించిన బొజ్జ గణపయ్య మద్యాహ్నం 1.40లకు హుస్సేన్ సాగర్ గర్భంలో నిమజ్జనమయ్యాడు. ఆ క్రతువు చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరారు. దీనితో నగర నడిబొడ్డున సాగర ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. జై బోలో గణేష్ మహరాజ్‌కీ జై అంటూ జయజయధ్వానాలు మార్మోగాయి. భక్తజనం చూస్తుండగానే కనురెప్ప పాటు కాలంలో గంగమ్మ ఒడిలోకి ఆ పార్వతీ పుత్రుడు చేరుకున్నాడు. 70 ఏళ్లుగా ఖైరతాబాద్‌లో వివిధ రూపాల్లో పూజలందుకున్న గణేశుడు, ఈసారి 70 అడుగుల మట్టి ప్రతిమతో ప్రపంచంలోనే ఎత్తయిన మట్టి గణపతిగా రికార్డుకు ఎక్కాడు.
స్వామికి ఓ వైపు రాహుకేతుల విగ్రహాలు, మరోవైపు అయోధ్యలో కొలువైన బాలరాముడి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఉక్కు, మట్టితో చేసిన ఈ భారీ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మట్టి విగ్రహంగా నిలిచి భక్తులను మరింత ఆకట్టుకుంది. ఇక ప్రధాన గణపతి మండపానికి ఓవైపు శ్రీనివాస కల్యాణం, మరోవైపు శివపార్వతుల కల్యాణ ఘట్టాలకు సంబంధించిన ప్రతిమలను చిన్న మండపాల్లో ఏర్పాటు చేశారు. ముందుగా ఆయా విగ్రహాలను టస్కర్లపై చేర్చారు, అనంతరం భారీ క్రేన్ సహాయంతో ప్రధాన విగ్రహాన్ని (బడా గణేష్) టస్కర్ పైకి చేర్చారు. గణపతిని టస్కర్ పైకి చేర్చిన తర్వాత పూర్తి పనులకే దాదాపు 4 గంటల సమయం పట్టింది. అనంతరం శోభాయాత్ర బయల్దేరే ముందు ఖైరతాబాద్ గణపతికి మరోమారు పూజలు జరిగాయి. ఖైరతాబాద్, సెన్సేషన్ థియేటర్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్క నుంచి, సెక్రటేరియట్ మీదుగా ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర వైభవంగా సాగింది. ఈ క్రతువును కనులారా వీక్షించేందుకు తరలిన భక్తజనంతో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా రద్దీ ఏర్పడింది. ముందెన్నడూ లేనంతగా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
ఆధ్యాత్మికంగా శోభయాత్ర..!
భాగ్యనగరం మొత్తం ‘జై గణేశ్ మహారాజ్ కీ జై’ నామస్మరణ మార్మోగింది. బొజ్జ గణపయ్య నిమజ్జన వేడుకల్లో పాల్గొనేందుకు భారీగా భక్తులు తరలిరాగా బోలో గణేష్ మహరాజ్ కి జై అంటూ భక్తుల జయజయధ్వానాలు,కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాల మద్య గణేశుడి విగ్రహాలు ముందుకు సాగాయి. శోభాయాత్రలో మహిళల నృత్యాలు ఆకట్టుకుంటున్నాయి. సాంప్రదాయం ఉట్టిపడే వేషధారణలో మహిళలు లంబోదరుడి శోభాయాత్రకు తరలివచ్చారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అంతా కనులపండుగగా గణేశుడిని గంగమ్మ ఒడిలోకి చేర్చారు. ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతం గణేశుడి నిమజ్జనానికి విచ్చలవిడిగా భక్తులతో కిక్కిరిసిపోయి సందడిగా మారాయి. ఇసుకేస్తే రాలనంతగా భక్తులు తరలిరావడంతో ఆ ప్రాంతం కోలాహలంతో సందడి చేశారు. అలాగే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని హుస్సేన్ సాగర్‌లో కనులారా వీక్షించేందుకు భారీగా తరలివచ్చారు. దీంతో సాగర్ హుస్సేన్ ప్రాంతమైన ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం ఐ మ్యాక్స్ మార్గాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వేలాది గణపతులను హుస్సేన్‌సాగర్‌లోకి నిమజ్జనం చేస్తూ వెళ్లిరావయ్యా గణపయ్య మళ్లీ అంటూ జనాలు నీరాజనం పలుకుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే గణపతి శోభాయాత్రలో భక్తులతో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కు భారీగా ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఈ మెట్రో సిబ్బంది మెట్రో స్టేషన్ గేట్లను మూసివేశారు. పది నిమిషాలకు ఒకసారి ప్రయాణికులకు సిబ్బంది లోపలికి పంపుతున్నారు. మెట్ల వద్ద గేట్లు కట్టడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నగరంలో 71 కృత్రిమ నీటి వనరులలోనూ నిమజ్జనం..!
వినాయక మండపాల నిర్వాహకులకు అనువుగా ఉండేలా గణేష్ విగ్రహాల నిమజ్జనానికి జీహెచ్‌సీ ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా 71 కృత్రిమ నీటి కొలను ఏర్పాటు చేశారు. వీటిలో ఖైరతాబాద్ జోన్ పరిధిలో 13, శేరిలింగంపల్లి జోన్‌లో 13, ఎల్పీనగర్, సికింద్రాబాద్ జోన్‌లలో చెరో 12, కూకట్‌పల్లి జోన్‌లో 11, చార్మినార్ జోన్‌లో 10 కృత్రిమ నీటి కొలను ఏర్పాటు చేశారు. విగ్రహాలను నిమజ్జనం చేయడంతో పాటు వెంటనే వ్యర్థాలను తొలగించేలా అక్కడ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ప్రతి విగ్రహాన్ని హుస్సేన్ సాగర్, సరూర్‌నగర్ చెరువులోనే కాకుండా ఆయా ప్రాంతాల్లో ఉన్న కృత్రిమ నీటి కొలనులో నిమజ్జనం చేయాలని అధికారులు సూచించారు. కృత్రిమ నీటి కొలనుల చుట్టూ పరిశుభ్రమైన వాతావారణం ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ట్యాంకుల ద్వారా నీటిని తీసుకొచ్చి నీటి కొలను నింపుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్స్‌తో చేసే విగ్రహాలను సహజ నీటి వనరులలో నిమజ్జనం చేసి నీటిని కలుషితం చేయడాన్ని హైకోర్టు తెలియజేస్తున్నాయి. దీంతో అధికారులు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేశారు.
రికార్డు బ్రేక్ చేసిన లడ్డులు…!
బాలాపూర్ గణనాథుని లడ్డు కొన్నవారికి అది కొంగు బంగారం అవుతుందనే నమ్మకం ఉంది, ఈ ఏడాది కూడా లడ్డు రికార్డు స్థాయి ధర పలికింది. స్థానికుడు కొలను శంకర్ రెడ్డి, వేలం పాటలో రూ.30.01 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. లడ్డూ వేలం పాటను ప్రారంభించిన కొలను కుటుంబ సభ్యులు తొమ్మిదోసారి లడ్డూను కైవసం చేసుకోవడం విశేషం. ముగ్గురు స్థానికేతరులతో నువ్వా-నేనా అన్నట్లు పోటీ పడిన శంకర్ రెడ్డి, రూ.3 లక్షలకు వెయ్యి రూపాయలు అధికంగా వేలం పాడి బాలాపూర్ లడ్డూ విజేతగా నిలిచారు. కాగా 40 ఏళ్ల కిందట చవితి వేడుకల్లో లడ్డూ వేలం పాటను ప్రారంభించిన తమ కుటుంబానికి మరోసారి గణేశుడి ఆశీర్వాదం లభించడం పట్ల శంకర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. బాలాపూర్ లడ్డూను దేశ ప్రధాని మోదీకి అంకితం ఇస్తున్నట్లు శంకర్ రెడ్డి ఉన్నారు. లడ్డూ వేలం పాటకు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా, మాజీ ఎమ్మెల్యే తీగల, మాజీ జడ్పీ చైర్మన్ అనితా హరినాథరెడ్డి, భాగ్యనగర ఉత్సవ సమితి సభ్యులు.అలాగే హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్ లంబోదరుడి చేతిలోని లడ్డూ రికార్డు ధర పలికింది. కీర్తి రిచ్మండ్ విల్లాస్ లో జరిగిన వేలంలో వినాయకుడి లడ్డూ ఏకంగా రూ.1.87 కోట్లు పలికింది.విల్లాలో 25 మంది కమ్యూనిటీ మొత్తం కలిసి ఆ లడ్డూను సొంతం చేసుకుంది.
పోలీసుల హై సెక్యూరిటీ..!
ఓవైపు గణేష్ నిమజ్జనం..మరోవైపు మిలాద్ ఉన్ నబీ రెండు ఉత్సవాలు ఒకే రోజు కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం సాధారణ, ఏఆర్, రిజర్వ్ పోలీసులతో పాటు కేంద్ర బలగాలను 40 వేల మందిని రంగంలో దింపింది. మసీదులు, ప్రార్ధనా మందిరాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. పలు చోట్ల పోలీసు ఆంక్షలు విధించారు. మరోవైపు గణేష్ విగ్రహాల కదలికలు, నిమజ్జన కేంద్రాల వద్ద ఏర్పాట్లపై డీజీపీ అంజనీకుమార్ నిరంతర పర్యవేక్షణ. అలాగే హుస్సేన్ సాగర్ వద్ద కొనసాగుతున్న గణేష్ నిమజ్జన తీరు, అక్కడి ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి, పీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్‌సీ మేయర్ జి. విజయలక్ష్మీ, జీహెచ్‌ఈ కమిషనర్ అమ్రపాలి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి అధికారులు, నిర్వాహకులకు కీలక సూచనలు చేశారు.