- సీఎం నుంచి పీసీ చీఫ్ గా బాద్యతలు స్వీకరించనున్న మహేశ్ కుమార్ గౌడ్
- మద్యాహ్నం రెండున్నరకు గాంధీభవన్ లో కార్యక్రమం
- అంతకు ముందు గన్ పార్క్ నుంచి గాంధీభవన్ వరకు భారీ ర్యాలీ
- తరలిరానున్న 5వేల మంది పార్టీ శ్రేణులు
- గాంధీభవన్ పరిసర ప్రాంతాల భారీ బందోబస్తు
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ నేడు రాష్ట్ర నూతన పీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు గాంధీభవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి నుంచి మహేశ్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతలను స్వీకరిస్తారు. ఈ క్రింది ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంతకు ముందు గన్ పార్క్ నుంచి గాంధీభవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించిన రాష్ట్ర కాంగ్రెస్.. అందకు 5వేల మంది పార్టీ శ్రేణులు వస్తారని అంచనా వేస్తున్నారు. బాద్యతలు స్వీకరించిన తర్వాత… గాంధీభవన్ ముందు బహిరంగ సభకు ఏర్పాటు చేసింది. అందులో మహేశ్ కుమార్ గౌడ్ పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించనున్నారు.
ఈ మేరకు కార్యక్రమ వివరాలను గాంధీభవన్ వర్గాలు ప్రకటించాయి. మధ్యాహ్నం 12 గంటలకు పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు గన్‌పార్క్ వద్దకు చేరుకుంటారు. అక్కడ ఒంటిగంటకు బయలు దేరి గాంధీభవన్ వరకు ర్యాలీగా వస్తారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి గాంధీభవన్‌లో చేరుకుంటారు. ఇప్పటి వరకు పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సీఎం రేవంత్‌రెడ్డి నుంచి కొత్తగా నియామకమైన పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పూజ తర్వాత గాంధీభవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలలో పాల్గొంటారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న స్టేజీ యాభై నుంచి 60 మంది వరకు కూర్చొనేందుకు వీలుగా ఉంటుంది. స్టేజి వద్ద 500 మంది వరకు ముఖ్యులు కూర్చొనేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా గాంధీభవన్ ప్రాంగణంలో పెద్ద ఎత్తున తరలివచ్చే జనం వీక్షించేందుకు వీలుగా ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేస్తున్నారు. నూతన పీసీసీ అధ్యక్షుడికి స్వాగతం పలికేందుకు గాంధీభవన్ సుందరంగా ముస్తాబవుతోంది. ఇప్పటికే భవన్ మొత్తానికి రంగులు వేసే కార్యక్రమం పూర్తయింది.
భారీ బందోబస్తు..!
నూతన పీసీసీ చీఫ్ బాద్యతల స్వీకరణ మహోత్సవానికి దాదాపు ఐదువేల మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వస్తారని పార్టీ అంచనా వేస్తుండడంతో పోలీసు శాఖ కూడా ఆ మేరకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే గాంధీభవన్‌లో ఏర్పాటు చేస్తున్న సభ ప్రాంగణాన్ని పోలీసులు పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ హాజరుకావడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరొవైపు శాంతిభద్రతలు, ట్రాఫిక్ పరంగా ముందస్తు చర్యలు తీసుకుని సామాన్య ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పోలీసు అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై పదవీ బాధ్యతలు తీసుకునే సమయంలో చేయాల్సిన బందోబస్తు గురించి చర్చించారు. గన్‌క్‌క్ దగ్గర నుంచి గాంధీభవన్ వరకు ర్యాలీ నిర్వహించాలని పార్టీ నిర్ణయించడంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలుగకుండా ఏ విధంగా ర్యాలీని గాంధీభవన్ వరకు వచ్చేట్లు చూడాలనే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది.
గాంధీభవన్‌లో వాస్తు మార్పులు..!
ఇందిరాభవన్, గాంధీభవన్ మధ్య ఖాళీగా ఉన్న స్థానంలో సమావేశ నిర్వహణకు ఏర్పాటు చేస్తున్నారు. దీని పక్కన ఉన్న గాంధీభవన్ ప్రహరీ గోడ వర్షాలకు కూలిపోవడంతో తిరిగి నిర్మిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా వాస్తు మార్పులు కూడా చేస్తున్నారు. ఇప్పటికే గాంధీభవన్‌లోకి వచ్చేందుకు రెండు గేట్లు ఉన్నాయి. ఇప్పుడు మరో గేటు కూడా ఏర్పాటు చేసింది. అటు ఇందిరా భవన్, ఇటు గాంధీభవన్ మధ్య మరొక గేటు ఏర్పాటు చేయడంతో సీఎం లాంటి ముఖ్యులు ఎవరైనా రాకపోకలు సాగేందుకు ఇబ్బందులు లేకుండా ఉన్నారు. వీవీఐపీలు వచ్చినప్పుడే ఆ గేటు తెరిచేట్లు నిర్ణయించారు.