Home అంతర్ జాతీయ అధ్యక్ష అభ్యర్థుల చర్చలో  వెల్లువెత్తిన  నిందలు –  ఆరోపణలు! – Latest Telugu News | Telugu Breaking News Online- Sneha News

అధ్యక్ష అభ్యర్థుల చర్చలో  వెల్లువెత్తిన  నిందలు –  ఆరోపణలు! – Latest Telugu News | Telugu Breaking News Online- Sneha News

by Sneha News
0 comments
అధ్యక్ష అభ్యర్థుల చర్చలో  వెల్లువెత్తిన  నిందలు -  ఆరోపణలు! - Latest Telugu News | Telugu Breaking News Online


  • కమలా హారిస్ – ట్రంప్ మధ్య తీవ్ర వాగ్వివాదం !
  • సర్వేల్లో కమలా హారిస్ ముందంజ !

మరో యాభై నాలుగు రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా  సెప్టెంబర్ 10 రాత్రి ప్రధాన అభ్యర్థులు ఇద్దరి మధ్య జరిగిన బహిరంగచర్చలో  డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి , ప్రస్తుత   ఉపాధ్యక్షురాలు కమలా హారిస్  కొద్దిగా  ముందంజలో ఉన్నారు.

జూన్ లో జరిగిన చర్చలో అధ్యక్షుడు   జో బైడెన్ కంటే మాజీ అధ్యక్షుడు , రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఆధిక్యత సాధించిన సంగతి తెలిసిందే.ఆ తర్వాత డెమొక్రటిక్ పార్టీ జో బైడెన్ స్థానంలో కమలా హారిస్ ను అభ్యర్థిగా ప్రకటించింది. ఆమె రంగంలోకి వచ్చి కేవలం  ఏడు వారాలు మాత్రమే అయ్యింది. ఇప్పటివరకూ ఉపాధ్యక్షురాలిగానే తెలిసిన కమలా హారిస్ పై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. ఈ నేపథ్యంలో ఇద్దరు అభ్యర్థుల మధ్య చర్చ జరగడం ఇదే మొదటిసారి.

ఫిలడెల్ఫియా కానిస్టిట్యూషన్ సెంటర్లో ఎ.బి.సి. న్యూస్ చానల్  నిర్వహించిన తొంభై నిముషాల చర్చను ఎనిమిది ప్రధాన ఛానళ్ళు జాతీయ స్థాయిలో ప్రత్యక్ష ప్రసారం చేశాయి.ఈచర్చను సుమారు ఆరున్నర కోట్ల మంది వీక్షించారని ఎ బి సి సంస్థ గణాంకాలు చెబుతున్నాయి.చర్చ  ముగిసిన వెంటనే వివిధ వార్తా పత్రికలు, ఛానళ్ళు చేసిన అన్ లైన్ సర్వేల్లో కమలా హారిస్ అత్యధిక వీక్షకుల ఆమోదాన్ని పొందినట్లు వెల్లడి అయ్యింది!

సి.ఎన్.ఎన్. నిర్వహించిన ఒక సర్వేలో కమలా హారిస్ కు 63 శాతం వీక్షకుల మద్దతు లభించగా , డోనాల్డ్ ట్రంప్ కు 37 శాతం మంది వీక్షకులు మద్దతు ప్రకటించారు!

వాషింగ్టన్ పోస్ట్ , న్యూయార్క్ టైమ్స్, వాల్ స్ట్రీట్ జర్నల్, ఫాక్స్ న్యూస్, ఎన్.సి.బి.సి. , బీబీసీ , ది గార్డియన్  వంటి మీడియా సంస్థల సర్వేల్లో కూడా  కమలా హారిస్ కు మొగ్గు లభించినట్లు ఆయా సంస్థలు ప్రకటించాయి.

డెమొక్రటిక్ పార్టీ అనుకూల మీడియా సంస్థలు కమలా హారిస్ వైపు మొగ్గు ఉన్నట్లు చూపడం వరకూ   సహజమే. కానీ  రిపబ్లికన్ పార్టీ అనుకూల సంస్థలు కూడ ఈ  చర్చలో కమలా హారిస్ కు మొగ్గు ఉన్నట్లు తరతమ స్థాయిల్లో  పేర్కొన్నాయి.

రిపబ్లికన్ పార్టీ అనుకూల సంస్థగా పేరుపొందిన  “ఫాక్స్ న్యూస్”  సంస్థ  కూడా చర్చలో  కమలా హారిస్ కు మొగ్గు లభించిందని చెప్పింది.

అంతటితో ఆగకుండా   “చర్చలో  మొగ్గు వచ్చినంత మాత్రాన అధ్యక్ష ఎన్నికలు పూర్తియిపోయినట్లు కాదు” అంటూ ఒక   హెచ్చరికను కూడా జోడించింది. 

 “కమలా హారిస్ చేసిన ప్రకటనలలో  కనీసం ఏడు అవాస్తవాలు ఉన్నాయి , మోడరేటర్లు వాటిని ఫాక్ట్ చెక్ చేయకపోవడం పక్షపాతం కాదా”  అంటూ ఫాక్స్ న్యూస్  తన కథనంలో ప్రశ్నించింది.

ట్రంప్ తన వాదనల్లో కమలా హారిస్ చెప్పిన అవాస్తవాలను ఖండించక పోవడాన్ని కూడా ఆ కథనం తప్పు పట్టింది! “చర్చలో ఆయన  తనకు లభించిన అవకాశాలను వినియోగించు కోలేదు, తన విజయాలను , బైడెన్ ప్రభుత్వ వైఫల్యాలను వివరించడంలో ట్రంప్ విఫలం అయ్యారు” అని ఆ కథనం పేర్కొన్నది.

కమలా హారిస్ తో పోలిస్తే డోనాల్డ్ ట్రంప్ చర్చలో ఎక్కువసార్లు స్పందించారు. ఎక్కువ  సమయం తీసుకున్నారు. అయినా సరే ఆయనకు  వీక్షకుల మద్దతు లభించలేదని సర్వేల సారాంశం తేల్చింది.

2016  ఎన్నికల్లో ట్రంప్ ప్రచార బృందంలో కీలకపాత్ర పోషించిన  రిపబ్లికన్ సెనెటర్ ఒకరు దీనిపై స్పందించారు.”చర్చకు ట్రంప్ సరిగ్గా సంసిద్ధం కాలేదు, అది చివరకు ” విపత్తు” గా మారింది” అని ఆయన వ్యాఖ్యానించారు!

చర్చ ముగిసిన వెంటనే ఫిలడెల్ఫియా లో  తన మద్దతు దారులతో కమలా హారిస్ ఉత్సాహంగా మాట్లాడారు.

“ఈరోజు ఒక మంచిరోజు , మనం ఏం చేయదలచుకున్నామో ఇప్పటికే  మీరు ప్రజలకు చెబుతున్నారు, దాన్నే ఈ రాత్రి నేను నొక్కి చెప్పాను, మీరు మరింత కష్టపడండి, అమెరికన్ సమాజం  శ్రేయస్సు కోసం మనం చేసే ప్రతిపాదనలను ప్రజలు అవగాహన చేసుకుంటున్నారు” అన్నారు కమలా హారిస్.

డిబేట్ పూర్తయ్యాక ట్రంప్ చేసిన వ్యాఖ్య కూడా చర్చనీయాంశం అయ్యింది.  “పెద్ద ఎత్తున మనం గెలవబోతున్నాం , ఈ రాత్రి చర్చలో నేను బాగా మాట్లాడాను , నిజానికి ఇంతవరకూ నేను పాల్గొన్న చర్చల్లో ఇదే అత్యుత్తమమైనది, పైగా ఇటువైపు నేను ఒకణ్ణే  , అటువైపు ముగ్గురు ” అన్నారు  ట్రంప్. 

ఎ.బి.సి. న్యూస్ చానల్ తరపున చర్చ నిర్వహించిన మోడరేటర్లు డేవిడ్ మూయిర్ , లిన్సే  డేవిస్ , ఇద్దరూ చర్చలో  ట్రంప్ చెబుతున్న అవాస్తవాలపై   కనీసం ఐదు సందర్భాల్లో  జోక్యం చేసుకున్నారు!
సవరణలు, వివరణలు ఇచ్చారు!

ప్రెసిడెన్షియల్ డిబేట్ లో  నిజ నిర్ధారణలు చేయడాన్ని ట్రంప్ ఎద్దేవా చేశారు. “ఎ.బి.సి. ఛానల్  నిజాయితీ లేని సంస్థ” అని ఆయన  అభివర్ణించారు!

చర్చలో  కీలక అంశాలు..

ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు, అక్రమ వలసలు, వలస చట్టాలు,  సరిహద్దుల భద్రత ,  గర్భస్రావపు హక్కులు, ఆరోగ్య సంరక్షణ విధానం , కాలుష్య రహిత ఇంధనం , జాతి విద్వేషం, నేరాల పెరుగుదల , 2020 ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం చెలరేగిన హింస , గాజా మానవ సంక్షోభం , ఉక్రెయిన్ యుద్ధం , ఆఫ్ఘనిస్తాన్ వంటి అంశాలను మోడరేటర్లు ప్రస్తావించారు.ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి  అభ్యర్థులు ఇద్దరికి సమానంగా సమయం ఇచ్చారు.  స్పష్టత కోసం వివరణలు కోరారు. అడిగిన అంశంపై  కాకుండా వేరే విషయాలపై మాట్లాడుతుంటే అడ్డుకుని చర్చను దారిలోకి తేవడానికి ప్రయత్నించారు.అయినా ట్రంప్ మాత్రం మోడరేటర్లను పట్టించుకోకుండా తన మానాన తాను మాట్లాడారు.  కొన్నిసార్లు అదనపు సమయం తీసుకుని మాట్లాడారు.

తాను బలమైన నాయకుడిననీ, తన హయాంలో చైనాను కట్టడి చేసానని, యూరోపును అదుపు ఆజ్ఞల్లో ఉంచానని, తనను  ప్రపంచం ఎంతో గౌరవించిందని , తన హయాంలో ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయ్యిందని,  ధరలు అదుపులో ఉన్నాయని డోనాల్డ్ ట్రంప్ వాదించారు.

వందల  మిలియన్ల డాలర్లు ఖర్చు చేసినా రష్యా  ఉక్రెయిన్  యుద్దాన్ని అపడంలో విఫలం అయ్యారని , జో బైడన్ పాలనా యంత్రాంగం అసమర్ధమైనదని ,  తాను సాధించిన విజయాలను ధ్వంసం చేసిందని, దేశం పతనం అంచుల్లో ఉందని, మన జాతి మరణించబోతున్న జాతిగా తయారయ్యిందని ట్రంప్ గట్టిగా  వాదించారు.

అక్రమ వలసదారుల విషయంలో తాను కఠినంగా వ్యవహరించానని , మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టి అక్రమ  వలసలను అరికట్టానని ట్రంప్ చెప్పారు. 163 దేశాలనుండి అక్రమంగా చొరబడ్డ ఒక కోటి పది లక్షల మంది దేశంలో ఉన్నారని , వారి వల్ల దేశంలో నేరాలు పెరిగిపోతున్నాయని , వారందరినీ దేశం నుండి బైటికి పంపిస్తానని ట్రంప్ గట్టిగా చెప్పారు. గత మూడున్నరేళ్లుగా  డెమొక్రాట్లు చేసిందేమీ లేదని , ఇప్పుడు కొత్తగా ఏదో చేస్తామంటూ మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని  ట్రంప్ అన్నారు.

తమది బలహీన ప్రభుత్వం అనడాన్ని కమలా హారిస్ గట్టిగా ఖండించారు.చరిత్రలో మున్నెన్నడూ కనీ వినీ ఎరుగని ఆర్థిక విధ్వంసం ట్రంప్ నుండి తమకు వారసత్వంగా దక్కిందని దాన్ని తామే  దారిలో పెట్టామని కమలా హారిస్ చెప్పారు.ట్రంప్ పాలనలో బిలియనీర్లు లబ్ధి పొందారని , అమెరికన్ సమాజానికి వెన్నెముకగా ఉన్న మధ్యతరగతి ,  శ్రామిక ప్రజలకు ట్రంప్ పాలనలో ఒరిగింది ఏమీ లేదని కమలా హారిస్ వాదించారు. “ఆయన అన్నివిధాలా దేశాన్ని ధ్వంసం చేశారు, అయినా కోవిడ్ మహ్మారిని మేం సమర్ధంగా ఎదుర్కున్నాం ” అని ఆమె చెప్పారు.

“అందరికీ అవకాశాలు” ఇచ్చే  ఆర్థిక వ్యవస్థను నిర్మించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని , తయారీ రంగంలో ఎనిమిది లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయని , నిర్మాణ రంగంలో మరిన్ని ఉద్యోగాలు వస్తున్నాయని ఆమె వివరించారు. ప్రజలు ఇళ్లు కట్టుకోవడానికి , చిన్న దుకాణ దారులకు ఆర్థిక తోడ్పాటు అంద చేస్తామని , ప్రజలకు  ధరలభారం లేకుండా రాయితీలు ఇస్తామని కమలా హారిస్ ప్రకటించారు.

ఒబామా కేర్ తర్వాత తమ పాలనలో అమల్లోకి తెచ్చిన ఆరోగ్యసంరక్షణ వ్యవస్థను మరింత మెరుగు పరుస్తామని, ప్రజలకు ఆరోగ్య సంరక్షణ తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వచ్చే విధంగా బీమాలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని తెస్తామని ఆమె వివరించారు.

అక్రమ వలసల విషయంలో తమ ప్రభుత్వం ఇప్పటికే గట్టి చట్టాలను తెచ్చిందని , తాను  ఒక ప్రాసిక్యూటర్ గా అక్రమ వలసలను అరికట్టడానికి గట్టి కృషి చేశానని  ఆమె ప్రస్తావించారు.

అక్రమ వలసల విషయంలో తాము తెచ్చిన చట్టాన్ని గతంలో  ట్రంప్ పార్టీ వ్యతిరేకించిందని ఆమె గుర్తు చేశారు.

గర్భస్రావపు హక్కుల విషయంలో తాము ఒకచట్టం తెస్తామని , ఈ విషయంలో మహిళలకు గల నిర్ణయాధికారాన్ని ,  స్వేచ్ఛను  కాపాడి తీరాలని , అందుకు తాను గట్టిగా నిలబడతానని ఆమె స్పష్టం చేశారు.
రిపబ్లికన్ పార్టీ ఈ చట్టానికి  మద్దతు ఇస్తుందా అని ఆమె ప్రశ్నించారు.

అమెరికన్ సైన్యం ఇప్పుడు ఇతర దేశాల్లో సైనిక చర్యల్లో పాల్గొనడం లేదని , ఆఫ్ఘనిస్ధాన్ నుండి సైనికులను సురక్షితంగా వెనక్కి తెచ్చామని ,  రష్యా ఉక్రెయిన్ యుద్దాన్ని ఆపడానికి , ఇజ్రాయెల్, పాలస్తీనా సంక్షోభాన్ని నివారించడానికి తక్షణ ప్రాధాన్యం ఇస్తామని ఆమె చెప్పారు!
ముందుగా యుద్ధం ఆగిపోవడం ముఖ్యమని ఆమె చెప్పారు.

రంగు , జాతి, మత, భాషా వివక్షలు లేని సామరస్య పూర్వక సమాజాన్ని  నిర్మించడమే తమ లక్ష్యమని , జాతి విద్వేషాలు పెంచడానికి  ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు దేశాన్ని విభజిస్తాయని ఆమె అన్నారు.

పరస్పర నిందలు – దెప్పి పొడుపులు!

అక్రమ వలస దారులు అమెరికా ప్రజల పెంపుడు కుక్కలను , పిల్లులను తినేస్తున్నారని ట్రంప్  ఆరోపించారు. అది నిజం కాదని మోడరేటర్లు చెప్పినా ఆయన పట్టించుకోకుండా మళ్లీ అదే ఆరోపణ చేసారు.
అలాంటి అక్రమ వలసదారులకు “లిబరల్స్” మద్దతు ఇస్తున్నారని ట్రంప్ అన్నారు. వారి వల్లనే నేరాలు పెరిగిపోతున్నాయని ఆయన పలుసార్లు పేర్కొన్నారు.

“పలు రకాల రాజకీయ , ఆర్థిక , లైంగిక నేరాలకు విచారణ ఎదుర్కుంటున్న  ట్రంప్ వంటి నేరస్తుడు నేరాల గురించి మాట్లాడ్డం విడ్డూరంగా ఉందని, ఆయన అధికారంలోకి వస్తె చట్ట బద్ద పాలన ఉండదని” కమలా హారిస్ గట్టిగా విమర్శించారు.

“తనపై ఉన్నవన్నీ  రాజకీయ ప్రేరేపిత కేసులని , వాటిని కోర్టులు  త్వరలో కొట్టేస్తాయని” ట్రంప్ అన్నారు.

“2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత జరిగిన హింసాకాండకు విచారం వ్యక్తం చేస్తారా”  అంటూ మోడరేటర్లు ట్రంప్ ను ప్రశ్నించారు. 

అందుకు ట్రంప్ గట్టిగా నిరాకరించారు.
“2020 ఎన్నికల ఫలితాలు ఒక ఫ్రాడ్” అని   ట్రంప్ వాదించారు., వివిధ రాష్ట్రాల్లో వచ్చిన ఓట్ల గణాంకాలను ఆయన వివరిస్తూ “ఆ ఎన్నికలు  దేశ ప్రజాస్వామ్య  చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం” అని ఆయన అన్నారు.

“క్యాపిటల్ హిల్ మీదకు గుంపులు హింసాయుతంగా వెళ్ళడానికి తనకూ సంబంధం లేదని , తాను శాంతి యుతంగా , ప్రజాస్వామ్య పద్ధతిలో వెళ్లాలని కోరినట్లు ”  ట్రంప్ చెప్పారు.

“ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం గౌరవం లేని ఇలాంటి వ్యక్తి అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి కూడా అనర్హుడు , ఎనిమిది కోట్ల పది లక్షల మంది ఓటర్లు  వ్యతిరేకంగా ఓట్లు వేస్తే దాన్ని అర్థం చేసుకోవడానికి నిరాకరిస్తున్న వ్యక్తిని చూసి సిగ్గు పడుతున్నాను” అని కమలా హారిస్ దెప్పి పొడిచారు.

 “ఉపాధ్యక్షురాలిగా ఎన్నో దేశాలు పర్యటించాను,  ఆయా దేశాల నేతలు ఎన్నికల ఫలితాల విషయంలో  ట్రంప్ తీసుకున్న వైఖరిని చూసి  నవ్వుకుంటున్నారు ,  దేశ ఎన్నికల వ్యవస్థకే  అగౌరవం కలిగే విధంగా ట్రంప్ వ్యవహరించారు , అని ఆమె అన్నారు. 

“ప్రపంచంలో అన్ని దేశాల అధినేతలు తనను అపారంగా గౌరవిస్తారని  హంగేరి ప్రధానమంత్రి చెప్పారని”  ట్రంప్ అన్నారు.

“కమలా హారిస్ ఆఫ్ఘనిస్ధాన్ చర్చలకు సారథ్యం వహించారు , ఆమె అక్కడి నుండి  రాగానే పుతిన్ ఉక్రెయిన్ పై దాడి చేసారు, అది మీకున్న గౌరవం,  యుద్ధం ఆపడంలో బైడెన్ ప్రభుత్వం విఫలం అయ్యింది” అని ట్రంప్ అన్నారు.

“ట్రంప్ అధ్యక్షుడు అయి ఉంటే ఇప్పటికే పుతిన్ కీవ్ లో కూర్చుని ఉండే వారు, అమెరికా సారథ్యంలో నాటో చేస్తున్న కృషి కారణంగానే  ఉక్రెయిన్ ఇంకా స్వతంత్ర దేశంగా ఉనికిలో ఉంది , జెలెన్ స్కీ గట్టిగా పోరాడుతున్నారు “అని కమలా హారిస్ అన్నారు.

“ట్రంప్ ను పొగిడితే చాలు ఆయనకు దేశ ప్రయోజనలేవీ పట్టవు , ఆయన్ని పొగిడే   స్నేహితులందరికీ ఆవిషయం తెలుసు ,  ప్రపంచంలో నియంతలు అందరూ ఆయనకు స్నేహితులే , ఆయన్ని మళ్ళీ ఎన్నుకుంటే ఆయన కూడా ఒక నియంతగా మారతారు” అని కమలా హారిస్ అన్నారు.

“ట్రంప్ అంటేనే ఒక అయోమయం , ఒక అరాచకం , ఆయనకు చట్టబద్ధ పాలన అంటే తెలియదు”అని కమలా హారిస్ విమర్శించారు.

“ట్రంప్ మళ్ళీ  అధికారంలోకి వస్తే బిలియనీర్లకు లాభం , మధ్యతరగతి వారికి లాభం ఏమీ ఉండదు , గర్భ స్రావపు హక్కులకు  ఆయన వ్యతిరేకి,   ఆయన పదేపదే విద్వేష వ్యాప్తికి , సమాజంలో విభజనకి ప్రయత్నిస్తున్నారు , ఇటువంటి వ్యక్తిని ఎక్కడపెట్టాలో  అమెరికన్ సమాజానికి బాగా  తెలుసు”  అని కమలా హారిస్ అన్నారు.

ప్రతి సందర్భంలో జో బైడెన్ ను ప్రస్తావిస్తూ ట్రంప్ మాట్లాడటంపై  కమలా హారిస్  అభ్యంతరం చెప్పారు.

“ఇక్కడ పోటీలో ఉన్నది కమలా హారిస్, జో బైడెన్ కాదు” అని ఆమె గుర్తు చేసారు.

డెమొక్రటిక్ పార్టీ ఆర్థిక విధానాలను విమర్శిస్తూ “వాళ్ళు లిబరల్స్, కమలా హారిస్ నేపథ్యం చూడండి , ఆమె రాడికల్ లిబరల్ , లెఫ్టిస్టు , మార్క్సిస్టు , వాళ్ళ నాన్న మార్క్సిస్టు పిలాసఫీని బోధించిన ప్రొఫెసర్ , వీళ్లకి అధికారం ఇస్తే మన దేశం ఒక వెనిజులా మాదిరిగా  ధ్వంసం అవుతుంది” అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు! 

“పదేళ్ల నుండి ఇవే మాటలు ,  జనంలో భయం రేకెత్తించే విద్వేషపు మాటలు , 
ఆయన రోజూ చెప్పే   మాటలు వినీ వినీ నాకే కాదు రిపబ్లికన్ మద్దతు దారులకు   కూడా బోరు కొడుతోంది , ఈ రొడ్డ కొట్టుడు వినలేక  ట్రంప్ ర్యాలీల నుండి జనం  జారు కుంటున్నారు” అన్నారు కమలా హారిస్!

“నా ర్యాలీలకు జనం వస్తున్నారు,  ఆమె ర్యాలీలకు అసలు జనమే రావడం లేదు , అందుకే వాళ్ళు డబ్బిచ్చి జనాల్ని పోగేస్తున్నారు” అని   ట్రంప్ అన్నారు. 

“ట్రంప్ ఆర్థిక , రాజకీయ , సామాజిక  , సైనిక నిర్ణయాలు అధ్వాన్నంగా ఉన్నాయని , ఆయన్ని మరోసారి ఎన్నుకుంటే దేశం పెను విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందని”  ఆయన హయాంలో పనిచేసిన పలువురు  సీనియర్ అధికారులు చేసిన వ్యాఖ్యలను కమలా హారిస్  ఉదహరించారు.

“వాళ్లంతా పని చేతకాని వాళ్లు , నేను వాళ్ళని పీకేసాను , అందుకే వాళ్ళు నాపై విమర్శలు చేస్తున్నారు” అంటూ ట్రంప్ సమాధానం చెప్పారు.

ముగింపులో అభ్యర్థులు ఇద్దరికి ఒక్కో నిముషం సమయం ఇచ్చారు. తమ ముగింపు వ్యాఖ్యలు చేయాల్సిందిగా మోడరేటర్లు కోరారు.

“ట్రంప్ గతం గురించి మాట్లాడుతున్నారు. విద్వేష భాష మాట్లాడుతున్నారు. ఆయనను మళ్ళీ ఎన్నుకుంటే దేశం వెనక్కి పోతుంది. అమెరికన్ చరిత్రలో కొత్త పేజీ తెరుద్దాం , మేము భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాం , అందరికీ అవకాశాలు ఇచ్చే ఆర్థిక వ్యవస్థను నిర్మిద్దాం, కొత్త తరానికి  ఓటు వెయ్యండి , దేశాన్ని ముందుకు తీసుకు వెళ్దాం” అని ముగించారు కమలా హారిస్.

“అవి చేస్తాం ఇవి చేస్తాం అని ఇప్పుడు  చెబుతున్న కమలా హారిస్ గత మూడున్నరేళ్లుగా ఏం చేసారు? ఏమీ చేయలేదు , దేశాన్ని ధ్వంసం చేశారు,
చెప్పడం తప్ప వారికి చేసే సామర్థ్యం లేదు. అమెరికాను మరోసారి ఘనమైన దేశంగా తీర్చి దిద్దడానికి సమర్ధవంతమైన నాయకత్వం కావాలి, అందుకు నన్ను ఎన్నుకోండి” అంటూ ముగించారు ట్రంప్.

చర్చ జరిగినంత సేపూ కమలా హారిస్ నిబ్బరంగా , ప్రశాంతంగా , నవ్వుతూ , ఆత్మ విశ్వాసంతో మాట్లాడగా ట్రంప్ ఆవేశపడి పోతూ , ఆగ్రహంగా , మాట్లాడారని పలువురు టివీ  వ్యాఖ్యాతలు అభిప్రాయ పడ్డారు.

“మరో చర్చ కోసం మేం ఎదురు చూస్తున్నాం “అంటూ కమలా హారిస్ ప్రచార బృందం ప్రకటించింది. 

“మరో చర్చ అవసరం లేదని” ట్రంప్  భావిస్తున్నట్లు ఆయన ప్రచార బృందం తెలిపింది.

చర్చ జరగడానికి ముందు  కంటే చర్చ ముగిసిన తర్వాత కమలా హారిస్ ఓటింగ్ సానుకూలత పెరిగిందని 538 అనే సంస్థ పేర్కొన్నది. ఆమెకు 47.3 శాతం మద్దతు ఉన్నట్లు చెప్పింది.

అక్టోబర్ మొదటి వారంలో ఉపాధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగే చర్చ నాటికి ఓటర్ల మనోగతంపై  మరింత స్పష్టత వస్తుందని పరిశీలకులు అంటున్నారు. 

డి.సోమసుందర్,
సెప్టెంబర్ 11 వ తేదీ.
(ఆస్టిన్ , టెక్సాస్ , అమెరికా నుండి)

You may also like

Leave a Comment

Soledad is the Best Newspaper and Magazine WordPress Theme with tons of options and demos ready to import. This theme is perfect for blogs and excellent for online stores, news, magazine or review sites.

Buy Soledad now!

Edtior's Picks

Latest Articles

u00a92022u00a0Soledad.u00a0All Right Reserved. Designed and Developed byu00a0Penci Design.